
మద్యం కిక్కు
► ఒక్కరోజులోనే రూ.కోటిన్నర విలువజేసే మద్యం తాగేశారు
► కనిపించని పెద్దనోట్ల రద్దు ప్రభావం
నాగర్‌కర్నూల్ విద్యావిభాగం : ఒకవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు పోలీసులు నిబంధనలు విధించినా జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులు ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.కోటిన్నరకు పైగా విలువజేసే మద్యం తాగేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, బార్ షాపుల్లో మద్యం విక్రయిం చారు. బెల్ట్‌షాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరి గాయి. జిల్లావ్యాప్తంగా 45 వైన్ షాపులతోపాటు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కరోజే 2,300 కేసుల లిక్కర్, నాలుగువేల పైచిలుకు బీరు కేసులు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి దాదాపు 52 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు నగదు దొరకక సతమతమవుతుంటే మందుబాబులపై దీని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గతంలో ప్రతినెలా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో తిమ్మాజీపేటలోని మద్యం డిపో నుంచి రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు అమ్ముడయ్యేది. పెద్దనోట్ల రద్దు అనంతరం నెల రోజులపాటు పరిశీలిస్తే రూ.160 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. దీనికితోడు కొత్త జిల్లాగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ ఒకరోజు ముందే మందుబాబులపై ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించడం గమనార్హం.