
బెల్టు షాపులపై చర్యలేవీ..?
- మద్యంపై ఎంఆర్‌పీ విధానం పాటించాలి
- ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్‌సీపీ వినతి
చిత్తూరు(అర్బన్) : రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేస్తానంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు నెల రోజులవుతున్నా జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా మూయించకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లె శ్రీనివాసులు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు, గాయత్రీ దేవీ మాట్లాడుతూ జిల్లాలో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడంలేదన్నారు. రుణమాఫీకి కూడా సీఎం సంతకం పెట్టి ఇప్పుడు డబ్బుల్లేవంటూ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారన్నారు. బెల్టు షాపులను అరికట్టడానికి ఎలాంటి నిధులు అవసరం లేదని, ఉన్న అధికారులను సద్వినియోగం చేసుకుంటే చాలని సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం ఉత్పత్తి కూడా తగ్గిందని, అయితే కొన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే వారికి నిర్ణయించిన లక్ష్యం కంటే అక్రమంగా మద్యం ఉత్పత్తి చేస్తూ ఆదాయాలను సమకూర్చుకుంటున్నాయని ఆరోపించారు.
జిల్లాలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. బెల్టు షాపులను తొలగించాలని, మద్యం ఎంఆర్‌పీకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు రూరల్ మండల కన్వీనర్ రాజా, నేతలు బాలాజీ, శీన, శివ, బాబు పాల్గొన్నారు.