పల్నాడు ప్రాంతంలోని పల్లెల్లో నడుస్తున్న బెల్టు దుకాణం
బావమరిది: బావా.. ఎన్నిరోజులైంది.. మా ఊరొచ్చి పద పద నీకు మంచి పార్టీ ఇవ్వాలి.
బావ: ఈ టైమ్‌లో( రాత్రి 11 గంటలు) ఎక్కడికి వెళతాంలే బామ్మర్ది..అయినా ఈ పల్లెటూళ్లో చుక్క దొరకదుగా..
బావమరిది: ఎంత మాటన్నావ్ బావా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక..మా ఊళ్లోనూ బెల్టు షాపు పెట్టారు.. ఎప్పుడంటే అప్పుడు మందే మందు.. కాకపోతే క్వార్టర్‌కు రూ.30 ఎక్కువ.
బావ: పల్లెల్లోనే కాదు బామ్మర్తి.. మేముండే రాజధానిలోనూ క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 ఎక్కువ గుంజుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే తంతు. మద్యం సిండికేట్ మొత్తం అధికార పార్టీ వాళ్లదే కదా. ఇక అధికారులు కూడా మామూళ్లు పుచ్చుకుని మత్తుగా జోగుతున్నారు.. అయినా బామ్మర్తి మీ ఊళ్లో తాగడానికి నీళ్లు ఉండవుగానీ.. మందు భలే దొరుకుతోందిరా..
బావమరిది: అవును బావా .. టీడీపీ వాళ్లా.. మజాకా.. ఆ మందుతోనే లక్షలు బొక్కేస్తున్నారు.. ఇకవెళ్లి నాలుగు చుక్కలు గొంతులు పోసుకుందాం పద.
సాక్షి, గుంటూరు: జిల్లాలో మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి తమ హవా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం అమ్మకాలు జరుపుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అధికార పార్టీ నేతల అండదండలతో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో క్వార్టరు బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో క్వార్టరుకు రూ.35 చొప్పున పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రేయింబవళ్లు అనే తేడా లేకుండా ఈ మద్యం అమ్మకాల దందా నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే తాడేపల్లి, ఉండవల్లిలో సైతం ఒక్కో క్వార్టర్ బాటిల్‌కు రూ.10 వరకూ అధికంగా అమ్ముతున్నారు.
రాజధాని ప్రాంతంలోనూ ఎక్కువే..
మంత్రులు, వీవీఐపీలు, ఉన్నతస్థాయి అధికారులు నిత్యం తిరిగే రాజధాని ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం సిండికేట్లన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో ఈ దుస్థితి దాపురించింది. ఎక్సైజ్ అధికారులు కొందరు మద్యం సిండికేట్ల వద్ద నెలవారీ మామూళ్ళు తీసుకుంటూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరి కొందరు ఎక్సైజ్‌శాఖ అధికారులు అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిస్తూ వచ్చే లాభంలో వాటాలు గుంజుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం నెల వారీ మామూళ్లు పంపాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మద్యం దుకాణదారులు బహిరంగంగానే చెబుతున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న బెల్టు షాపులు...
జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా 900 వరకూ బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 70 వరకు బెల్టు షాపులు (బడ్డీకొట్టులతో సహా) నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో లైసెన్సు దుకాణాల కంటే మూడు రెట్లు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మంత్రుల ఇలాఖాలో ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు ఉన్నాయి. బెల్టు షాపుల్లో అమ్మకాల ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో ఎవరి వాటా వారికి అందుతోందని ఎక్సైజ్ అధికారులే ఒప్పుకుంటున్నారు. అన్నీ తెలిసినా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు మాత్రం తమకెందుకులే అన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎనీటైమ్ మద్యం
గుంటూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రాత్రి పగలు తేడా లేకుండా ఎనీ టైమ్ మద్యం దొరుకుతోంది. అర్ధరాత్రి సైతం మద్యం దుకాణాలకు మరో ద్వారం గుండా అమ్మకాలు జరుపుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన సైతం అర్ధరాత్రి, తెల్లవారు జామున సైతం మద్యం అందుబాటులో ఉండడంతో డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్సైజ్ అధికారులుగానీ, రాత్రి గస్తీలో ఉండే పోలీసులుగానీ రాత్రి నడిచే మద్యం దుకాణాల జోలికి వెళ్లడం లేదు.
నెలవారీ మామూళ్లు
లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పొందిన వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బు గుంజిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి తనయులు నెలవారీ మామూళ్లు సైతం వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో మద్యం సిండికేట్‌లు రెచ్చిపోతున్నారు. వీరి వద్ద ముడుపులు పుచ్చుకున్న అధికార పార్టీ నేతలు అండగా ఉండమే వీరి అక్రమాలకు కారణంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment