గోనెల మాటున గోల్‌మాల్!
ధాన్యం వ్యాపారులు కాసులు దండుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ కొత్త మోసాలతో బరితెగిస్తున్నారు. నిన్నటి వరకు సాధారణ గోనెసంచుల్లో పక్క జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న వీరు.. ఇప్పుడు ఏకంగా కొనుగోలు కేంద్రాల అనుమతులు పొందిన మిల్లులు ముద్రించిన గోనెసంచులతో అడ్డుగోలు వ్యాపారానికి తెరతీస్తున్నారు.
వీరఘట్టం: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను అధికారుల ఆధ్వర్యంలో ధాన్యం అమ్మే రైతులకు ఇవ్వాన్నది ప్రభుత్వ నిబంధన. అయితే కొనుగోలు కేంద్రాల సిబ్బందితో దళారులు, వ్యాపారులు చీకటి ఒప్పందం కుదుర్చుకోవడంతో గోనె సంచులు అడ్డుగోలుగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు చూపించాలంటే సాధారణ గోనెసంచులలో ఉన్న ధాన్యాన్ని మిల్లర్ల ముద్రించిన గోనె సంచుల్లోకి మార్చేందుకు కలాసీ కూలీ అదనంగా బస్తాకు రూ.3.50 అవుతుంది. దీంతో ఈ కూలీ ఎగ్గొట్టేందుకు నేరుగా అనుమతి ఉన్న గోనె సంచుల్లోనే ధాన్యం తరలిస్తున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో ఉన్న మిల్లర్లు, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో పలువురు దళారులతో ఒప్పందాలు కుదుర్చుకుని యథేచ్ఛగా అక్రమం వ్యాపారానికి తెగబడ్డారు. జోరుగా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
జిల్లాలో గోనె సంచుల కొరతమన జిల్లాలో గోనెసంచులు కొరత ఉండడంతో ఇదే అదునుగా వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. 45 రోజుల నుంచి విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ కొనుగోలు కేంద్రాలతో కుమ్మక్కైన అయిన మిల్లర్ల వద్ద ప్రస్తుతం ఖాళీ గోనెసంచులు ఉన్నాయి. దీంతో అక్కడ కొందరు దళారులు ఆ గోనె సంచులను నేరుగా వీరఘట్టానికి ఆటోల ద్వారా, ఇతర వాహనాల ద్వారా తెప్పిస్తూ బహిరంగ వ్యాపారాన్ని చేస్తున్నారు. గోనెసంచులపైముద్రలు చిన్నవిగా ఉండడంతో ఇవి వీరఘట్టానికి చెందినవే అని అందరూ పొరబడుతున్నారు.
పట్టించుకోని అధికారులు అధికారుల కళ్లముందే రోజూ మండలం నుంచి 25 లారీల వరకు ధాన్యం లోడులు తరలిపోతున్నా ఏ ఒక్క అధికారీ ఈ లారీలను అడ్డుకోవడం లేదు. వాస్తవంగా అనుమతులు ఉన్న వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్క శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. అలాగే రూట్ అనుమతులు పొంది ఉండాలి. ఈ ప్రాంతంలో చెక్ పోస్టులు లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చింది. విజయనగరం జిల్లా రాయవలస వద్ద వ్యవసాయ చెక్ పోస్టు ఉన్నప్పటికి ఇక్కడ పూర్తిస్థాయిలో వాహనాలను సోదా చేయకపోవడంతో ధాన్యం అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.చర్యలు తప్పవువిజయనగరం జిల్లాకు చెందిన గోనె సంచులతో అడ్డుగోలు వ్యాపారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఎం.వి. రమణ సాక్షికి తెలిపారు. తమ సిబ్బందితో నిఘా వేసి ధాన్యం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటామన్నారు.