వెంకట్రావు(టీడీపీ నేత): ఏంది పాపారావు.. బాగా హుషారుగా ఉన్నావ్.. ఎక్కడ నుంచి వస్తున్నావ్
పాపారావు(సామాన్యుడు): అదా.. చెప్పకూడదులే.. నీకు రుచించదు.
వెంకట్రావు: పర్లేదులే పాపారావు చెప్పు..
పాపారావు: మళ్లీ నువ్వు ఎవరితో అనడకూడదంటే చెబుతాను..
వెంకట్రావు: అట్టాగేలే చెప్పు..!
పాపారావు: ఏ పార్టీ గెలుస్తుందా అని మన ఊళ్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి కదా.. అక్కడికెళ్లా.. అందరూ ఫ్యాన్ వైపే కాస్తన్నారు.. నాకూ ఆ పార్టీ మీదే నమ్మకం ఉంది..అందుకే నేను కూడా అటే పందెం కట్టొచ్చా.
వెంకట్రావు:అదంతా ఉట్టిదేరా..! టీడీపీకి 150 సీట్ల వరకు వస్తాయని బాబు బల్లగుద్దుతున్నారు.. కొన్ని చానళ్ల సర్వేలు కూడా అదే చెబుతున్నాయి.
పాపారావు: ఆ చానళ్లు, బాబు గారి మాటలు నమ్మి.. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా టీడీపీ గెలుస్తుందని పందెం కట్టావా!
వెంకట్రావు:ఆఆఆఆ... (తల గోక్కుంటూ) ఎవరికీ చెప్పవుగా..!
పాపారావు: చెప్పనులే చెప్పవయ్యా!
వెంకట్రావు: ఈ సారి నా పందెం కూడా అటే(వైఎస్సార్ సీపీ) వేశా!ఎలాగూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. ఎంత అభిమానం ఉన్నా జేబులు గుల్ల చేసుకోవడం ఎందుకు? మొన్న ఎలక్షన్లకే చాలా ఖర్చు పెట్టా.. ఆ డబ్బులన్నా రావాలి కదా.. నేనే కాదు మా పార్టీ వాళ్లు చాలా మంది అటే పందెం కట్టారు.. మళ్లీచెబుతున్నా.. ఎవరికీ చెప్పొద్దురో.. కొంప మునిగిద్ది.
సాక్షి, గుంటూరు: సార్వత్రిక సమరం ఈ నెల 11న ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఫలితాలు వెలువడటానికి ఇంకా 26 రోజుల సమయం ఉంది. ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు కుటుంబ సభ్యులతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని చల్లని ప్రదేశాలకు క్యూ కట్టారు. మరో వైపు ఎండ వేడికి పోటీ పడుతూ రాష్ట్రమంతటా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వేడి రాజుకుంది. చాలా వరకూ బెట్టింగ్ రాయుళ్లు వైఎస్సార్ సీపీకే సై అంటున్నారని.. టీడీపీ వైపు పందెం వేయడానికి నైనై.. అంటున్నారని తెలుస్తోంది.
పందేలు జరుగుతాయిలా..
సాధారణంగా రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏపార్టీ ఫామ్ చేస్తుంది.. ప్రభుత్వం ఫామ్ చేసే పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు అదనంగా ఎన్ని సీట్లు వస్తాయి.. కీలక అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎంత మెజార్టీ సాధిస్తుంది.. ఇలా పలు రకాలుగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తుంటారు. ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్లందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు కాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు కాసే నాథుడే కనిపించడం లేదు.
అది మేకపోతు గాంభీర్యమే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయు డు తమ పార్టీ 150 స్థానాల వరకు కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ప్రజల నాడి మాత్రం వైఎస్సార్ సీపీకే పట్టం కట్టినట్లు స్పష్టం అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని తెలుగుదేశం పార్టీ నాయకులే గ్రహించారు. అందుకే ఆ పార్టీ గెలుపై ఎవరిలోనూ ధీమా కనిపించడం లేదు.
కీలక స్థానాలపై..
ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లకు మొదటి స్థానంలో ఉండే జిల్లా టీడీపీ నాయకులు సైతం తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు వేసేందుకు ముందుకు రావడం లేదని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలోని మంగళగిరి, చిలకలూరిపేట, కుప్పం, పులివెందుల, గుడివాడ సీట్లపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నా యి. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలు నేర్పిన గుణపాఠం వల్ల కొందరు టీడీపీ తరఫున బెట్టింగ్‌లు వేసేందుకు వెనకాడుతున్నారు.
రేటింగ్ ఇస్తామన్నా.. నో.. నో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, కీలక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుపొందుతారని బెట్టింగ్ రాయుళ్లు ఒకటికి ఒకటిన్నర, రెండు చొప్పున రేటింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ టీడీపీ ఓటమి ఖాయమని అందరికీ అర్థం కావడంతో ఆ పార్టీ తరఫున బెట్టింగ్ వేసేందుకు చాలా వరకూ వెనుకడుగు వేస్తున్నారట. వైఎస్సార్ సీపీ తరఫున రేటింగ్ ఇస్తుండటంతో కొన్ని సందర్భాల్లో ఆశావహులైన టీడీపీ వర్గీయులు బెట్టింగ్‌కు సరేనని తీరా డబ్బు కలిపే సమయానికి ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment