కోడూరు (కృష్ణా జిల్లా), న్యూస్‌లైన్: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఎనిమిది ఎకరాల భూమిని 17 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనపర్చుకున్నారు. ఆ భూమిని.. ఆక్రమణదారులకే కౌలు కింద తిరిగి ఇచ్చేశారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండమూరు సీతారామయ్య 70 ఏళ్ల కిందట పోటు మీద, మందపాకల గ్రామ పరిధిలోగల 8.10 ఎకరాల మాగాణి భూమి రాసిచ్చారు. అప్పటి నుంచి 1997 వరకు ఆ భూములను గ్రామంలోని రైతులకు దేవస్థానం అధికారులు కౌలుకు ఇచ్చారు. ఆ రైతులు ఎప్పటికప్పుడు భద్రాచలంలోని దేవస్థానం అధికారులకు కౌలు ఇస్తున్నారు. 1997 తరువాత పోటుమీదలో ఉన్న భూములను అదే గ్రామానికి చెందిన 18 మంది రైతులు, మందపాకలో భూములను అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సాగు చేసుకుంటున్నారు.
అప్పటి నుంచి పంట కౌలు దేవస్థానానికి చేరడం లేదు. ఈ విషయాన్ని ఇక్కడి రెవెన్యూ అధికారులు భద్రాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దేవస్థానం ఈఓ రఘనాథ్, ఏసీ రాజేంద్ర, విజయవాడ దుర్గగుడి ఏసీ దుర్గాప్రసాద్, స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి పోలీసుల సహాయంతో రైతులతో శుక్రవారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ పొలాల్లో తరతరాలుగా పండించుకుని జీవనం సాగిస్తున్నామని, ఏ విధమైన కౌలు చెల్లించలేమని ఆ రైతులు అధికారులకు తెగేసి చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని, ఈ సంవత్సరం నుంచి కౌలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిర్చారు. పోటుమీద గ్రామంలోని భూమికి 2013 సంవత్సరానికి రూ.24,000 కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మందపాకల గ్రామ భూములకు సంబంధించి కౌలు విషయం భద్రాచలం వచ్చి ఏసీ కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఈవో రఘనాథ్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ భూములకు కౌలు వేలం పాటలు నిర్వహించి, పాటను సొంతం చేసుకునే వారికి పొలాలను అప్పగిస్తామని ఈవో అన్నారు.
భద్రాద్రి రామయ్య భూములు స్వాధీనం
Published Sat, Feb 22 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement