
స్వాధీనం చేసుకున్న దుంగలతో టాస్క్‌ఫోర్స్ అధికారులు
రైల్వేకోడూరు: మండలంలోని బాలపల్లె రేంజ్ లో శనివారం అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఐ కృపానంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డివిజన్ పరిధిలోని బాలపల్లి రేంజ్ శ్రీనివాసపురం ఎస్టీకాలనీ సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
సంఘటనా స్థలానికి వెళ్తుండగా కొందరు దుంగలను అక్కడే కిందపడేసి పరారయినట్టు తెలిపారు. అక్కడున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయినవారికోసం గాలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ ఆలీబాషా, ఇన్‌స్పెక్టర్ బాలక్రిష్ణ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.