పోలీసుల అదుపులో మాజీ మంత్రి?
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్‌ను అరెస్టు చేసి... అతడు చెప్పిన సమాచారం మేరకు పలు డంప్‌లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు, పట్టుబడ్డ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై, వేలూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వీళ్ల ప్రయేయం, పాత్రపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని చిత్తూరు జిల్లా పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.
మూడు కంటైనర్లలో ఎర్రదుంగలు
నాలుగు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడ్డ భారీ ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు మూడు కంటైనర్లలో చిత్తూరుకు తరలిస్తున్నారు. పశ్చిమబెంగాల్ భూటాన్ సరిహద్దులో ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసులు దాడులు చేసి సౌందర్‌రాజన్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకోవడమేగాక కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. వీటిని రోడ్డు మార్గంలో అత్యంత భద్రత నడుమ చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్నారు.