koduru
-
ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: మండలంలోని బాలపల్లె రేంజ్ లో శనివారం అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఆర్ఐ కృపానంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డివిజన్ పరిధిలోని బాలపల్లి రేంజ్ శ్రీనివాసపురం ఎస్టీకాలనీ సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. సంఘటనా స్థలానికి వెళ్తుండగా కొందరు దుంగలను అక్కడే కిందపడేసి పరారయినట్టు తెలిపారు. అక్కడున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయినవారికోసం గాలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ ఆలీబాషా, ఇన్స్పెక్టర్ బాలక్రిష్ణ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఊయలే..ఉరితాడై..!
కోడూరు: స్నేహితులతో కలిసి ఊగుతున్న ఊయలే ఆ బాలుడికి ఉరితాడైంది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది. కోడూరులోని అంబటి బ్రహ్మణయ్య కాలనీకి చెందిన గొర్ల రామాంజనేయులు, అంజలిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గొర్ల చైతన్య (10), చిన్న కుమారుడు బాలవర్థన్ వడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్కు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో శనివారం చైతన్య, బాలవర్థన్, కాలనీలోని తోటి స్నేహితులతో కలిసివారి ఇంటి వెనుక భాగంలోని చెట్టుకు చీరతో వేసి ఉన్న ఊయల ఊగేందుకు వచ్చారు. చైతన్య ఉయ్యాల ఎక్కి ఊగుతూ చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిరిగాడు. దీంతో చీర చైతన్య మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య విగత జీవిలా చీర మధ్యలో మాట్లాడకుండా ఉండిపోయాడు. చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా, అప్పటికే చైతన్య ప్రాణాలు విడిచాడు. -
సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు
సాక్షి, కోడూరు: చెన్నైకి చెందిన రెండు వేట బోట్లు సాంకేతిక సమస్య కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయి మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఘటన హంసలదీవి సాగరతీరంలో చోటుచేసుకుంది. పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన నలుగురు మత్స్యకారులు, కాకినాడకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వారం క్రితం రెండు బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ (శనివారం) సాయంత్రం పాలకాయతిప్ప సముద్రతీరానికి వచ్చే సరికి రెండు బోట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో కంగారుపడిన మత్స్యకారులు ఆ రాత్రంతా బోట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం సముద్రం పాటు సమయంలో మత్స్యకారులు బోట్లలో ఉన్న కొన్ని పరికరాల సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎవరికి చెప్పకుండా బోట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. సోమవారం ఉదయం స్థానిక మత్స్యకారులు సముద్రంలో బోట్లు నిలిచి ఉండడాన్ని గమనించి విషయాన్ని పాలకాయతిప్ప మెరైన్ పోలీసులకు అందించారు. ప్రత్యేక పడవలో వెళ్లిన పోలీసులు మెరైన్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక పడవలో నిలిచిన బోట్లకు వెళ్లారు. బోట్లలో ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. నలుగురు మాత్రమే బోట్లలో ఉండగా మిలిగిన వారు సామగ్రి కోసం విజయవాడ వెళ్లినట్లు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నట్లు మెరైన్ సీఐ పవన్‌కిషోర్ చెప్పారు. సముద్రంలో చోరబాటుదారులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీకి వెళ్లిన వారిలో ఎస్ఐ జిలానీ, రైటర్ రెహమాన్ జానీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. -
ఆ మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదు: కలెక్టర్
సాక్షి, కోడూరు : కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకోల్లలో చెలరేగిన స్వైన్ ఫ్లూ కలకలంపై కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. చింతకోల్లలో సంభవించిన మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదని తేల్చిచెప్పారు. అనారోగ్యంతో, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వారు చనిపోయినట్లు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులను స్వైన్ ఫ్లూ నెపంతో ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మందుస్తు నివారణకు ఆర్సీనిక్ అల్బెమ్ హోమియో మందు ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. -
స్వైన్‌ప్లూ కలకలం
కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకొల్లలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. వారం రోజుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో వైరస్ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు ప్రభుత్వాధికారులకు తెలియడంతో వారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవులు కూడా ప్రకటించారు. ఆర్డీఓ ఆద్వర్యంలో గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజల ఆందోళన చెందకుండా ఉండేందుకు గ్రామంలో స్వైన్‌ప్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోన్నారు. -
కుప్ప కూలిన బతుకులు
వారు రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. కూలి పనులే వారికి ఉపాధి. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్లి తిరుగు పయనం కాగా.. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బి.కోడూరు : బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరతామనుకుంటున్న సమయంలో శ్రీరామ్‌నగర్ గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో పందీటి వెంకటసుబ్బమ్మ (48), పందీటి ఆదిలక్షుమ్మ (28) అనే మహిళలపై ఆటో బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బద్వేలులోని ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లగా అప్పటికే వెంకటసుబ్బమ్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిలక్షుమ్మను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆదిలక్షుమ్మకు భర్త ఓబులేసు, అవినాష్ (4), అఖిల్ (2), లక్ష్మి (3 నెలలు) పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన లక్కినేని శేఖర్ అనే వ్యక్తికి కాలు విరిగిపోగా, పందీటి అచ్చమ్మకు తలకు తీవ్ర గాయమైంది. లక్కినేని లలితమ్మకు నడుం భాగం, తలకు తీవ్ర గాయాలు కాగా నాగిపోగు పోలమ్మ, లక్కినేని నారాయణమ్మ, పందీటి ఓబులమ్మ, పందీటి రాజా, అట్లూరు గోపాలయ్య, పందీటి చిన్నయ్య, నాగిపోగు గుర్రమ్మ, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని కడప రిమ్స్‌కు తరలించారు. వీరిలో నాగిపోగు పోలమ్మ, అట్లూరు గోపాలయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మృతులు, క్షతగాత్రులు అంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీడీఓ మల్లన్న, మండల తహసీల్దారు దుగ్గిరెడ్డి, ఏపీఓ నాగిరెడ్డి, బి.కోడూరు ఎస్ఐ బాలమద్దిలేటిలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, వైవీయూ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, డ్వామా పీడీ హరిహరనాథ్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బోరెడ్డి శేషారెడ్డి, నాయకులు బోడి రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మున్నెల్లి సర్పంచు ఓ.రమణారెడ్డిలు పరామర్శించి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు బి.కోడూరు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన 108 వాహనం ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినా సరైన సమయంలో అంబులెన్స్ రాలేదు. దీంతో క్షతగాత్రులంతా రోడ్డుపై అలాగే పడిపోయి ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు వాహనాలలో కొంత మందిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే వెంకటసుబ్బమ్మ, ఆదిలక్షుమ్మలు మృతిచెంది ఉండేవారు కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. -
చోరీలతో బెంబేలు
చిలమత్తూరు : కోడూరు పంచాయతీ అంజితండా సమీపంలో గల లేపాక్షి నాలెడ్జ్ హబ్ కార్యాలయంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. కార్యాలయంలోని సోఫాలు, టేబుల్స్ తదితర ఫర్నిచర్, విలువైన సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఎత్తుకెళ్లుతున్నట్లు తెలిపారు. గ్రామంలోకి కూడా చొరబడతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిఘా ఉంచాలని కోరుతున్నారు. -
ఔరా..సొర..!
సహజంగా పెరట్లో రెండు నుంచి మూడు కేజీల సోరకాయలు పెరగడం చూస్తాం. కానీ కోడూరుకు చెందిన నంద్యాల శ్రీనివాసరావు పంటపొలం గట్టున నాటిన సొరపాదుకు ఏకంగా 15 కేజీల సొరకాయలు కాసి అబ్బురపరుస్తున్నాయి. మూడు నెలల క్రితం శ్రీనివాసరావు గుంటూరు నుంచి సొరగింజలు తీసుకువచ్చి పొలం గట్టున నాటారు. ప్రస్తుతం ఈ పాదు పెద్దదై పెద్దమొత్తంలో సొరకాయలు కాయగా, అవి 15 కేజీలకు పైగా బరువు ఉన్నాయి. ఎలాంటి ఎరువులు ఉపయోగించకుండానే ఈ సొరకాయలు కాశాయని శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. - కోడూరు -
కారు బోల్తా: ఒకరి మృతి
అనంతపురం: వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. హిందూపూర్ టీచర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్(21), శేఖర్(25) అనే ఇద్దరు స్నేహితులు సోమవారం ఉదయం పెనుకొండ నుంచి హిందూపూర్‌కు కారులో బయలు దేరారు. కారు చిలమత్తూరు మండలం కోడూరు వద్దకు చేరు కోగానే ఒక్కసారిగా ముందు టైరు పేలిపోవడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు శేఖర్‌ను హిందూపూర్ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: డంప్‌చేసి ఉన్న 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు రేంజ్ అధికారి వి.నరసింహులు తెలిపారు. స్థానిక అటవీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి సమాచారం మేరకు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఉర్లగడ్డపోడు రైల్వేబ్రిడ్జి పక్కన డంప్ చేసి ఉన్న దుంగలను పట్టుకున్నామన్నారు.పట్టుబడ్డ దుంగల విలువ రూ.2లక్షలు చేస్తాయన్నారు. ఈ దాడుల్లో డీఆర్ఓ జీడీ మద్దిలేటి, చిట్వేలి అటవీ శాఖ అధికారి శ్రీరాములు, వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు. -
భద్రాద్రి రామయ్య భూములు స్వాధీనం
కోడూరు (కృష్ణా జిల్లా), న్యూస్‌లైన్: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఎనిమిది ఎకరాల భూమిని 17 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనపర్చుకున్నారు. ఆ భూమిని.. ఆక్రమణదారులకే కౌలు కింద తిరిగి ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండమూరు సీతారామయ్య 70 ఏళ్ల కిందట పోటు మీద, మందపాకల గ్రామ పరిధిలోగల 8.10 ఎకరాల మాగాణి భూమి రాసిచ్చారు. అప్పటి నుంచి 1997 వరకు ఆ భూములను గ్రామంలోని రైతులకు దేవస్థానం అధికారులు కౌలుకు ఇచ్చారు. ఆ రైతులు ఎప్పటికప్పుడు భద్రాచలంలోని దేవస్థానం అధికారులకు కౌలు ఇస్తున్నారు. 1997 తరువాత పోటుమీదలో ఉన్న భూములను అదే గ్రామానికి చెందిన 18 మంది రైతులు, మందపాకలో భూములను అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సాగు చేసుకుంటున్నారు. అప్పటి నుంచి పంట కౌలు దేవస్థానానికి చేరడం లేదు. ఈ విషయాన్ని ఇక్కడి రెవెన్యూ అధికారులు భద్రాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దేవస్థానం ఈఓ రఘనాథ్, ఏసీ రాజేంద్ర, విజయవాడ దుర్గగుడి ఏసీ దుర్గాప్రసాద్, స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి పోలీసుల సహాయంతో రైతులతో శుక్రవారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ పొలాల్లో తరతరాలుగా పండించుకుని జీవనం సాగిస్తున్నామని, ఏ విధమైన కౌలు చెల్లించలేమని ఆ రైతులు అధికారులకు తెగేసి చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని, ఈ సంవత్సరం నుంచి కౌలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిర్చారు. పోటుమీద గ్రామంలోని భూమికి 2013 సంవత్సరానికి రూ.24,000 కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మందపాకల గ్రామ భూములకు సంబంధించి కౌలు విషయం భద్రాచలం వచ్చి ఏసీ కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఈవో రఘనాథ్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ భూములకు కౌలు వేలం పాటలు నిర్వహించి, పాటను సొంతం చేసుకునే వారికి పొలాలను అప్పగిస్తామని ఈవో అన్నారు.