bhadradri sri swami sitaramacandra temple
-
భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ప్రభాస్ తరపున యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి శనివారం అందించారు. అనంతరం ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ చిత్రం సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది. (చదవండి: కోపంతో నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టా.. హీరోయిన్) ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం తర్వలోనే విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించారు. గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. -
TSRTC: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల డిమాండ్ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. బుక్ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేయనుంది. భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాల తొలి బుకింగ్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం సజ్జనర్‌కు టీఎస్ఆర్టీసీ బిజినెస్ హెడ్(లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందన్నారు. ఎంతో విశిష్టమైన ఆ తలంబ్రాలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారనని పేర్కొన్నారు. ‘గత ఏడాది 88 వేల మంది బుక్ చేసుకుంటే.. ఈ సారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్షమందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. మొదటగా 50 వేల మందికి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం హోండెలివరీ చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నాం. భక్తుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు పొడిగించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. భక్తులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ఎంతో విశిష్టమైన తలంబ్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, పీవీ మునిశేఖర్, సీటీఎం జీవనప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ -
భద్రాద్రి రామయ్య భూములు స్వాధీనం
కోడూరు (కృష్ణా జిల్లా), న్యూస్‌లైన్: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఎనిమిది ఎకరాల భూమిని 17 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనపర్చుకున్నారు. ఆ భూమిని.. ఆక్రమణదారులకే కౌలు కింద తిరిగి ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండమూరు సీతారామయ్య 70 ఏళ్ల కిందట పోటు మీద, మందపాకల గ్రామ పరిధిలోగల 8.10 ఎకరాల మాగాణి భూమి రాసిచ్చారు. అప్పటి నుంచి 1997 వరకు ఆ భూములను గ్రామంలోని రైతులకు దేవస్థానం అధికారులు కౌలుకు ఇచ్చారు. ఆ రైతులు ఎప్పటికప్పుడు భద్రాచలంలోని దేవస్థానం అధికారులకు కౌలు ఇస్తున్నారు. 1997 తరువాత పోటుమీదలో ఉన్న భూములను అదే గ్రామానికి చెందిన 18 మంది రైతులు, మందపాకలో భూములను అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సాగు చేసుకుంటున్నారు. అప్పటి నుంచి పంట కౌలు దేవస్థానానికి చేరడం లేదు. ఈ విషయాన్ని ఇక్కడి రెవెన్యూ అధికారులు భద్రాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దేవస్థానం ఈఓ రఘనాథ్, ఏసీ రాజేంద్ర, విజయవాడ దుర్గగుడి ఏసీ దుర్గాప్రసాద్, స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి పోలీసుల సహాయంతో రైతులతో శుక్రవారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ పొలాల్లో తరతరాలుగా పండించుకుని జీవనం సాగిస్తున్నామని, ఏ విధమైన కౌలు చెల్లించలేమని ఆ రైతులు అధికారులకు తెగేసి చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని, ఈ సంవత్సరం నుంచి కౌలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిర్చారు. పోటుమీద గ్రామంలోని భూమికి 2013 సంవత్సరానికి రూ.24,000 కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మందపాకల గ్రామ భూములకు సంబంధించి కౌలు విషయం భద్రాచలం వచ్చి ఏసీ కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఈవో రఘనాథ్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ భూములకు కౌలు వేలం పాటలు నిర్వహించి, పాటను సొంతం చేసుకునే వారికి పొలాలను అప్పగిస్తామని ఈవో అన్నారు.