బాబుతో జైసమైక్యాంధ్ర అనిపించగలరా?
హైదరాబాద్ : ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత కూడాలేని టీడీపీ..రాష్ట్ర విభజన విషయంలో రెండుకళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేస్తోందని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుతో.. జై సమైక్యాంధ్ర అనిపించగలరా అంటూ.. భూమన టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్రాన్ని విభజించే పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన స్పష్టంచేశారు.
రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందన్నారు. మూడు ప్రాంతాలను వైఎస్ సమానంగా చూశారన్నారు. రాష్ట్ర ప్రజల మేలుకోరే తాము సమైక్యవాదాన్ని వినిపిస్తున్నామని భూమన అన్నారు. విభజన జరుగుతోందని తెలియగానే మొదట స్పందించింది వైఎస్ఆర్ సీపీయేనని ఆయన గుర్తు చేశారు.
తమ సమైక్య పోరాటం రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం పెట్టాలని తాము తొలి నుంచి కోరుతున్నామన్నారు. విభజన బిల్లుకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లోపలా, బయటా ఒకటే మాట అని భూమన స్పష్టం చేశారు. విభజనకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేయటం దుర్మార్గమని భూమన మండిపడ్డారు.
రాష్ట్ర విభజన తీర్మానంపై చర్చలో పాల్గొనని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ.. విభజన బిల్లుపై తమ అభిప్రాయం మాత్రమే చెప్పింది. విభజనను తమ పార్టీ పూర్తీగా వ్యతిరేకిస్తుందని.. తాము సమైక్యాంధ్రకోసమే పోరాడుతున్నట్టు.. భూమన కరుణాకర్‌రెడ్డి సభలో స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమానంగా చూశారన్న విషయాన్నికూడా భూమన సభలో గుర్తుచేశారు. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టారని భూమన మండిపడ్డారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దయాదాక్షిణ్యాలవల్ల ఎదిగిన నేతలు వైఎస్‌పై దుమ్మెత్తి పోయడంపై.. అసెంబ్లీలో భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో తెలంగాణలో రూ.20వేల కోట్లు ఖర్చు చేశారని భూమన సభలో ఉటంకించారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించినవారిలో తెలంగాణవారే ఎక్కువన్న ఆయన ..సందర్భోచితంగా.. శ్రీశ్రీ పంక్తులను సభలో పేర్కొన్నారు.
ఆర్టికల్ -3ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైఎస్‌ఆర్‌సీపీ కోరలేదని.. షిండేకు రాసిన లేఖలో విభజించాలని కోరలేదని.. భూమన కరుణాకర్‌రెడ్డి సభలో స్పష్టంగా వివరించారు. ఏ ప్రాంతానికి మేలు జరగనప్పుడు విభజన ఎందుకన్న ఆయన.. రాష్ట్రాన్ని ఇచ్చిమొచ్చినట్లుగా కోయమనలేదన్నారు. జనంలోకి వెళ్తే అధికార, ప్రధాన ప్రతిపక్షాల బండారం బయట పడుతుందన్నారు.