
సాక్షి, హైదరాబాద్ : వృద్ధిరేటుపై ఏపీ ప్రభుత్వం అసత్యాలు చేప్తోందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మాయమాటలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర జీడీపీ పెరిగిపోతుందని హడావిడి చేస్తున్నారని, నాబార్డు నివేదికను చూస్తే బాబు పాలన ఎలా ఉందో తెలుస్తుందని ధ్వజమెత్తారు. నాబార్డు నివేదికపై చంద్రబాబు ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. ఏపీలో రైతాంగం సంక్షోభంలో ఉందనే విషయాన్ని నాబార్డు, నీతిఆయోగ్ తెలిపిందన్నారు. నాబార్డు నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులను వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు.
డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని భూమన నిప్పులు చెరిగారు. రైతులు, మహిళలు, యువతను చంద్రబాబు మోసం చేశారన్నారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడుల విషయంలోనూ అసత్యాలే చెప్తున్నారని తెలిపారు. చంద్రబాబు అండ్ కో రూ.4 లక్షల కోట్లు దోచుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 80శాతం మంది ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందన్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రమే సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.