తుని, న్యూస్‌లైన్ :
ఇందిరా గాంధీ రాష్ట్రాల పురోభివృద్ధికి కృషి చేస్తే ఆమె కోడలైన సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ జ్యోతుల నెహ్రూ విమర్శించారు. స్థానిక సిద్ధార్థ విద్యాసంస్థల మైదానంలో శుక్రవారం రాత్రి పార్టీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా అధ్యక్షతన సమైక్యాంధ్ర సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్నబోస్, నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం 200 ఏళ్లు వెనక్కుపోతుందన్నారు. విద్య, వ్యవసాయ రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రానికి విశిష్ట అధికారాలు ఇస్తే రాష్ట్రాలు మనుగడ సాధించలేవని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయన్నారు. ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా ఏకపక్షంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు పట్టించుకోలేదని బోస్ విమర్శించారు.
సమైక్య ద్రోహి యనమల
ఆరుసార్లు తుని నియోజకవర్గం నుంచి గెలిచి కీలక పదవులు పొందిన యనమల రామ
కృష్ణుడు సమైక్య ద్రోహిగా మిగిలిపోయారని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే సమైక్యవాదాన్ని బలపరిచి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.సమైక్య వాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మల దృష్టికి తీసుకువెళ్లి సమర్ధమైన నాయకుడిగా దాడిశెట్టి రాజా నిరూపించుకున్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్ చేస్తున్న పోరాటానికి కార్యకర్తలందరూ అండగా నిలవాలని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ కోరారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్న దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి అన్నారు. చంద్రబాబు నాయుడు అండతోనే కిరణ్ సర్కార్ నడుస్తోందని, విభజన విషయంలోఇద్దరూ కుమ్మక్కయ్యారని మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు అన్నారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి, పి. గన్నవరం కోఆర్డినేటర్ మిండగుదుటి మోహన్, ప్రచార కమిటీ కన్వీనర్ రావురి వెంకటేశ్వరరావు, రాయపాటి రవీంద్ర చౌదరి, సిరిపురపు శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి, లోవ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలం బాబ్జి, మాకినీడి గంగారావు, తుని జేఏసీ చైర్మన్ ఎంవీ సూర్యనారాయణ రాజు, పలువురు జిల్లా నాయకులు, మూడు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?
Published Sat, Dec 21 2013 3:03 AM | Last Updated on Tue, Sep 3 2019 8:53 PM
Advertisement
Advertisement