ప్రియాంక ఓకే.. బట్ రాహుల్ నాట్ ఓకే! | Rahul Gandhi's leadership credentials will be challenged: ML Fotedar | Sakshi
Sakshi News home page

ప్రియాంక ఓకే.. బట్ రాహుల్ నాట్ ఓకే!

Published Mon, Oct 26 2015 12:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రియాంక ఓకే.. బట్ రాహుల్ నాట్ ఓకే! - Sakshi

ప్రియాంక ఓకే.. బట్ రాహుల్ నాట్ ఓకే!

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎల్ ఫోతేదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దపు నాయకురాలు, ఇందిరాగాంధీ రాజకీయ వారసురాలు అంటూ ప్రియాంకగాంధీపై ప్రశంసల జల్లు కురిపించిన ఫోతేదార్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మాత్రం విమర్శలు ఎక్కుపెట్టారు. త్వరలో విడుదల కానున్న తన పుస్తకం ‘ద చినార్‌ లీవ్స్‌'లో రాహుల్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఒప్పుకోరని కరాఖండిగా చెప్పారు.

మాజీప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఫోతేదార్.. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవంటూ పెదవి విరిచారు. రాహుల్ నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరించరని, సోనియాగాంధీ శకం కూడా దాదాపుగా ముగిసిపోయినట్లేనని ఫోతేదార్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ పగ్గాలు చేపట్టడాన్ని పార్టీలో చాలామంది ఒప్పుకోవడం లేదని, ప్రధానమంత్రి అభ్యర్థిగానూ రాహుల్‌ సరైనవాడు కాదన్నారు. అయితే రాజీవ్‌ గాంధీ కూడా ఇందిర తరహాలోనే అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చినా వారిద్దరూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కానీ ఆ నాయకత్వ లక్షణాలు రాహుల్‌లో ఉన్నాయా.. అనేది ప్రశ్నార్థకమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపైన ఆయన ధ్వజమెత్తారు. సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం పైనా ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. పార్లమెంటు ఉభయసభల్లోను నాయకులను ఎన్నుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.  ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సరిగ్గా వ్యవహరించలేదన్నారు. పార్టీకి దిశానిర్దేశం చేసేవారు ఎవరూ లేరని, కాంగ్రెస్ పార్టీ తన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కొత్త విషయాలను నేర్చుకోవడం మర్చిపోయింది'' అన్నారు. ‘‘అసలు పార్టీ చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలపై స్పష్టంగా లేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ వారసత్వం దిగజారుతోందని, ఇది చాలా బాధాకరం'' అన్నారు. సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చినా సోనియాగాంధీ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షురాలుగా కొనసాగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవచ్చునేమో కానీ పార్టీని కాపాడే స్థితిలో ఆమె లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాబోయే సవాళ్లను వీరు ఎదుర్కోగలరా? అనే ప్రశ్న వేధిస్తోందన్నారు. సోనియా ఏం చేయాలన్నా చాలామందిపై ఆధారపడాల్సి వస్తోందని, ఆమెకు సలహా ఇచ్చే వాళ్లలో చాలామంది అనేక విషయాల్లో ఆమె లాగానే అజ్ఞానులని ఫోతేదార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా చుట్టూ ఉన్నవాళ్లకు వారసుడిగా రాహుల్ ఎదగడం లోలోపల ఇష్టం లేదని, ఎందుకంటే రాహుల్ నాయకుడిగా ఎదిగితే తాము ఉనికిని కోల్పోతామన్నది వాళ్ల భయమని ఆయన తన పుస్తకంలో రాశారు. ఈ నేపథ్యంలో ఆయన  పుస్తకంలో లేవనెత్తిన  అంశాలు పెద్ద దుమారమే రేపనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement