న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు పలువురు దేశ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇక్కడి ఇందిర సమాధి శక్తిస్థల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పుష్పాంజలి ఘటించారు. ఇందిర హత్యకు గురైన ఇంటిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాలేదు. ఇందిర వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వం దూరంగా ఉండటంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర త్యాగాలు గౌరవించడం ప్రతి ప్రభుత్వం బాధ్యత అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు.
గొప్ప త్యాగాలు చేసిన వ్యక్తిని స్మరించుకోకుండా మోదీ ఐక్యతా పరుగును ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. తాము ఎవరిని తక్కువచేసి చూడటం లేదన్నారు.