తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పెద్దలతో మళ్లీ చర్చలు జరిపాకే రాష్ట్ర విభజన అంశంపై ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పెద్దలతో మళ్లీ చర్చలు జరిపాకే రాష్ట్ర విభజన అంశంపై ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేశామన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు సీమాంధ్రలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.
గురువారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ హడావుడిగా చేసిన ఏకగ్రీవ తీర్మానం సీమాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, అందుకే అక్కడ ఒక్కసారిగా ఉద్యమం ఎగసిందని తెలిపారు. ఈ పరిస్థితిని కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నాయన్నారు. ఉద్యమాల తీవ్రత తగ్గి, ఇబ్బందులను కూడా తొలగించాకే విభజనపై ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలా? వద్దా? అన్నది కేంద్రం ఆలోచనలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏపీఎన్జీవోల సభ వెనుక సీఎం కిరణ్ ప్రోత్సాహం ఉందనడం అవాస్తవమన్నారు.