బెల్లంపల్లి/కోటపల్లి, న్యూస్‌లైన్ : తూర్పు ప్రాంత ప్రజలు పులి గాండ్రింపులతో వణికిపోతున్నారు. అడవి రారాజు స్వైరవిహారం చేస్తుండటంతో ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని హడలెత్తిపోతున్నారు. అటవి ఉత్పత్తులకు వెళ్లే గిరిజను లు, పశువుల కాపరులు జంకుతున్నారు. గ్రామాలు, తండాలు, గూడాల ప్రజలు రాత్రియిందంటే బయటకు రావడం లేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వేరే గ్రామాలకు వెళ్లలేక, అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో పులి 12 పశువులను, ఒక దుప్పిని చంపేసింది. జనావాసాలలోకి కూడా చొరబడుతోంది. గత సోమవారం రాత్రి వేమనపల్లి మండలం కల్మలపేటలో చొరబడి ఉండ్రాళ్ల నగేశ్ ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవుపై దాడి చేసి హతమార్చింది. పక్కనే ఉన్న లేగదూడ పులి భయానికి గింజుకోవడంతో తాడుమెడకు బిగుసుకుని చనిపోయింది.
పులి పేరెత్తితేనే జంకు..
తూర్పు జిల్లాలోని నీల్వాయి, మంచిర్యాల, చెన్నూర్ అటవీ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తోంది. ఈ రేంజ్‌ల పరిధిలో జైపూర్, కోటపల్లి, చెన్నూర్, వేమనపల్లి, నెన్నె ల, దహెగాం మండలాలు, దాదాపు 45పైగా గ్రామాలు, 8వేల ఇళ్లు, 20వేలకుపైగా జనాభా నివసిస్తున్నారు. ఇందులో కోటపల్లి మండలకేంద్రంతో పాటు పంగిడిసోమారం, నక్కలపల్లి, షట్‌పల్లి, బొప్పారం, నాగంపేట, వేమనపల్లి మండలంలో బ ద్దంపల్లి, చామనపల్లి, బమ్మెన, నాగారం, జిల్లెడ తదితర గ్రామాలు పూర్తిగా అడవి ని అనుకునే ఉంటాయి. ఈ రెంజ్‌ల పరిధిలోకి మహారాష్ట్రలోని తడోబా పులుల సం రక్షణ కేంద్రం నుంచి పులి వచ్చి తిరుగుతోంది. అటవీ ప్రాంతంలో ఆడపులి కావడంతో తోడుకు రోజుకు సుమారు 30కిలోమీటర్ల నుంచి 60కిలోమీటర్ల వరకు సంచరిస్తోంది.
ఓ రోజు చెన్నూర్ రేంజ్, మరోరోజు మంచిర్యాల, నీల్వాయి రేంజ్‌లలో సంచరిస్తోంది. ఇలా నికరంగా ఉండకపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇ ప్పటి వరకు పశువులపై మాత్రమే ప్రతాపం చూపిన పులి గ్రామాల్లో చొరబడుతుం డటంతో మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అటవీ అధికారులు పులిని కట్టడి చేయలేకపోతున్నారు. పులి కదలికలను కెమెరాలో బంధించడంతోపాటు బేస్‌క్యాంపు సిబ్బందితో పులి జాడలు తెలుసుకుంటున్నారు. కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశిస్తుందేమోనని చూస్తున్నారు. ఒకవేళ కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లకపోతే తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా పులి సంచారం తూర్పు ప్రజలను తీవ్రంగా భయపెట్టిస్తోంది. అటవీ అధికారులు పులి కదలికలను ముందస్తుగానే గమనించి ప్రజల, మూగజీవాల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
భయంగా ఉంది..
మా ఇంటి ముందు ఉన్న ఆవును పులి చంపేయడంతో భయమేస్తోంది. మళ్లీ పులివచ్చి మా ఇంటిలోకి చొరబడి మాపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటి. పశువులు చనిపోవడంతో జీవనాధారం కోల్పోయాం. అధికారులు నష్టపరిహారం చెల్లించాలి.
- ఉండ్రాళ్ల నగేష్, బాధితుడు, కల్మలపేట
పులిరాకుండా చర్యలు తీసుకోవాలి
పులి గ్రామాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పులి సంచారంతో రాత్రి సమయంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లడానికి జంకుతున్నాం. గ్రామం చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- బొద్దున శ్రీకాంత్, కేతనపల్లి
ఇంట్లో ఉంటే భయం వేస్తంది..
ఇంటి ముందు ఆవును పులి చంపేవేయడంతో భయమేస్తోంది. పులి ఇళ్ల వద్దకు వస్తుండటం వల్ల చిన్న పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు స్పందించి పులి రాకుండా చూడాలి.
- సత్తక్క, కల్మలపేట
అదిగో పులి
Published Fri, Jan 24 2014 3:03 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement