బీజేపీతోనే అభివృద్ధి : వెంకయ్యనాయుడు
మదనపల్లె, న్యూస్‌లైన్: దేశంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని బీజేపీ జాతీయనాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం రాత్రి స్థానిక మిషన్ కాంపౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రపంచదేశాలు ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో భారతదేశంలో ఆయన నాయకత్వానికి మద్దతునివ్వాల్సిన ఆవసరం ప్రతి భారతీయుడిపై ఉందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా 24గంటలు కొనసాగుతుందన్నారు. ‘గుజరాత్‌లో కరెంటు పోదు.. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు రాదు’ అన్న చందాన ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పల్లెపల్లెకూ పక్కారోడ్లు, ప్రతి ఇంటికి, పాఠశాలలకు మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు ప్రతి చేనుకూ నీరు, ప్రతి చేతికీ పని- అన్న సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతుందన్నారు.
గంగా, కావేరి నదులను అనుసంధానం చేస్తామని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సీమకు 200 టీఎంసీల నీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. గత ముఖ్యమంత్రులు అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేశారని విమర్శించారు. రాయలసీమలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల ఏర్పాటుతోపాటు మదనపల్లె బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ప్రకటించారు. సినీనటులు శివాజీ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్య మంత్రులు ఈ జిల్లాలోని మదనపల్లెకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు.
బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ, మదనపల్లెను మరో గుజరాత్‌గా తీర్చిదిద్దాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రచార కమిటీ చైర్‌పర్సన్ పురందేశ్వరి, సినీ నటుడు కృష్ణంరాజు, సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రసంగించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, జిల్లా నాయకులు భాను ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ ఏవీ.సుబ్బారెడ్డి, బండి ఆనంద్, సామంచి శ్రీనివాస్, ప్రశాంత్, భగవాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
బీజేపీలోకి వాసుదేవరెడ్డి
మదనపల్లె, న్యూస్‌లైన్: ప్రముఖ వ్యాపారవేత్త, సినీనిర్మాత, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత చిన్నా వాసుదేవరెడ్డి బీజేపీలో చేరారు. గురువారం స్థానిక మిషన్‌కాంపౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కిసాన్ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయన జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు వెంకయ్యనాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈయన 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ తరఫున మదనపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అనంతరం రాజకీ యాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్‌పీ విలీనంతో చిరంజీవికి సైతం దూరంగా ఉంటూ ఇప్పుడు పార్టీ మారారు.