సరైన ప్రణాళికలతోనే ఉత్పాదకతతో కూడిన ఉపాధి
Civils Prelims
Paper - I
ఆర్థికవృద్ధి, ఉపాధి
మనదేశ అభివృద్ధి విధానంలో ఉపాధి ఒక ముఖ్యాంశంగా ఉంది. భారత్ అభివృద్ధి ప్రణాళికలలో ఉపాధి కల్పనకు అనేక విధానాలు, వ్యూహాలు అవలంభిస్తోంది. 1950వ దశకంలో పారిశ్రామిక ఆధారిత అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఉపాధికల్పనను ముఖ్యాంశంగా పరిగణించలేదు. పంచవర్ష ప్రణాళికలలో వృద్ధికి అనుగుణంగా ఉపాధి కల్పన ఉంటుందని ప్రణాళికా రచయితలు భావించారు. శాశ్వత, అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్న శ్రామికులు లభ్యం కావడమనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అత్యవసరం. నాణ్యతతో కూడిన ఉపాధి పెంపునకు ప్రభుత్వ విధానాలు దోహదపడే విధంగా ఉండాలి.
స్వాతంత్య్రానంతరం మొద టి నాలుగు దశకాల్లో ప్రభుత్వ రంగం నాణ్యతతో కూడిన ఉపాధి అందించడం ద్వారా ’కౌఛ్ఛీ ఉఝఞౌడ్ఛట’గా నిలిచింది. ప్రభుత్వ శాసనాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం ఉపాధి నియమావళిని పాటిస్తుందని ఆశించారు. 1970వ దశకం మధ్య భాగంలో అభివృద్ధి ప్రణాళికలో ఉపాధి వృద్ధి ప్రధాన అంశంగా నిలిచింది. స్వల్పకాల వేతన ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు లాంటి ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలను ఈ కాలంలో ప్రవేశపెట్టారు.
1990వ దశకం ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా స్వదేశీ ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ తొలగింపు, విదేశీ వాణిజ్యం సరళీకరణ, పెట్టుబడి ప్రోత్సాహక విధానాలను ప్రవేశపెట్టారు. తద్వారా 1990వ దశకం మధ్య భాగం నుంచి ప్రభుత్వ రంగంలో ఉపాధి వృద్ధి తగ్గింది. సరళీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థికవృద్ధి ఉపాధి పెరుగుదలకు దారితీయగలదని ఆశించారు. దీనికి విరుద్ధంగా ఆర్థిక వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడినా ఉపాధి వృద్ధి క్షీణించింది. అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలు, ఏ విధమైన సాంఘిక భద్రతలేని ఉపాధి సృష్టి జరిగింది. 2009-10లో నేషనల్ శాంపుల్ సర్వే వివరాల ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి స్తంభించింది.
ఉపాధి - జీడీపీ వృద్ధి
ఉపాధి వృద్ధిలో దీర్ఘకాల క్షీణతను నిర్లక్ష్యపర్చడం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఆర్థిక వృద్ధిరేటు కొనసాగుతున్నా ఉపాధి వృద్ధిలో తగ్గుదలను గమనించవచ్చు. 1972 - 73 నుంచి 1983 మధ్య కాలంలో జీడీ పీ వృద్ధి సగటున 4.7 శాతంగా నమోదు కాగా, ఉపాధి వృద్ధి సగటు 2.4 శాతం మాత్రమే. 1983 నుంచి 1993-94 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 5 శాతంగా నమోదైంది. ఈ కాలం లో ఉపాధి వృద్ధి సగటు 2 శాతం మాత్రమే. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 6.3 శాతం కాగా ఉపాధి వృద్ధి సగటు 1.8 శాతం మాత్రమే. 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో జీడీపీ వృద్ధి సగటు 9 శాతం కాగా, ఉపాధి వృద్ధి రేటు 0.22 శాతంగానే నమోదైంది. దీని ఆధారంగా జీడీపీ వృద్ధికి అనుపాతంగా దేశంలో ఉపాధి వృద్ధి జరగలేదని తెలుస్తోంది.
ముఖ్య రంగాల్లో ఉపాధి వృద్ధి
1972-73 నుంచి 2009-10 మధ్య కాలం లో ద్వితీయరంగానికి సంబంధించిన మైనింగ్, తయారీ రంగం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్, నిర్మాణరంగంలో ఉపాధి వృద్ధి మిగిలిన ప్రాథమిక, తృతీయ రంగాలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి వృద్ధి స్తంభించినప్పటికీ ద్వితీయ రంగంలో ఉపాధి వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. సేవల (తృతీయ) రంగంలో ఉపాధివృద్ధి మెరుగైనప్పటికీ 1972-73 తర్వాత ప్రతి పదేళ్ల కాలాన్ని పరిశీలించినప్పుడు తగ్గుదల ధోరణిని గమనించవచ్చు. ప్రాథమిక రంగంలో ఆశించిన విధంగా ఉపాధివృద్ధి లేదు.
వ్యవసాయ జీడీపీ వృద్ధిరేటులో తగ్గుదల, ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల, ప్రాథమిక రంగంలో ఉపాధి వృద్ధిరేటులో తగ్గుదలకు కారణాలుగా పేర్కొనవచ్చు. ద్వితీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో పెరుగుదల కారణంగా పారిశ్రామిక జీడీపీ వృద్ధిరేటులో ఒడుదుడుకులు ఉన్నప్పటికీ అధిక ఉపాధి వృద్ధి జరిగింది. తృతీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల కారణంగా అధిక సేవారంగ జీడీపీ వృద్ధి నమోదైనప్పటికీ ఉపాధి వృద్ధిరేటులో పెరుగుదల లేదు.
వివిధ కార్యకలాపాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగంలో భాగంగా నిర్మాణ రంగంలో ఉపాధివృద్ధి రేటు అధికంగా నమోదైంది. 1994 నుంచి 2005 మధ్య కాలంలో జీడీపీ వృద్ధిరేటుకు సమానంగా ఈ రంగంలో ఉపాధి వృద్ధి జరిగింది. తయారీ రంగంలోనూ 1983 నుంచి 2005 మధ్య కాలంలో ఉపాధి వృద్ధిరేటు అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో తగ్గింది. మొత్తం ఉపాధిలో మైనింగ్ వాటా 0.56 శాతం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్‌ల వాటా 0.26 శాతంగా ఉంది.
1994 నుంచి 2005 మధ్య కాలంలో మొత్తం ఉపాధిలో వీటి వాటా తగ్గింది. సేవా రంగంలో 1994-2005 మధ్య కాలం లో ఉపాధి వృద్ధిరేటు 5 శాతం కాగా, ఆ తర్వాతి కాలంలో తగ్గింది. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి 1983-2005 మధ్య కాలంలో అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో 6 శాతం వృద్ధినే నమోదు చేసుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి
గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి రేటు అధికంగా ఉన్నప్పటికీ, వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిలో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ముఖ్య వృత్తిగా ఉండటం వల్ల అధిక ఉపాధి కల్పిస్తున్నా ఉపాధివృద్ధి రేటులో తగ్గుదల కారణంగా మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధివృద్ధితక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. 1972-73 నుంచి 1983 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 4.58 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 4.08 శాతం మాత్రమే.
1994 నుంచి 2005 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి 3.2 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.5 శాతంగా నమోదైంది. తర్వాతి కాలంలో ఈ అంశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి వృద్ధి ఎక్కువ. ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ అధిక ఉపాధి వృద్ధి నమోదైంది. 1993-94 నుంచి 2004-05 మధ్య నిర్మాణ రంగంలో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 5.6 శాతం.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధికి సంబంధించి రవాణా రంగం రెండో స్థానాన్ని, వాణిజ్యం మూడో స్థానాన్ని పొందాయి. పట్టణ ప్రాంతా ల్లో రవాణా రంగంతో పోల్చినప్పుడు వాణిజ్యంలో ఉపాధి వృద్ధి ఎక్కువ. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి గ్రామీణ ప్రాంతా ల్లో 6.30 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 7.54 శాతం. మొత్తం మీద 1972-73 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిరేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.
సంఘటిత రంగంలో ఉపాధి
సంఘటిత (ప్రభుత్వ, ప్రైవేటు) రంగం నాణ్యతతో కూడిన ఉపాధిని అందిస్తోంది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 10 శాతం. 1990వ దశకం మధ్య భాగం నుంచి మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా క్రమంగా తగుతోంది. దీంట్లో ఉపాధి తగ్గుదల ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా ఉంది. 2001-04 మధ్య కాలంలో ప్రైవేట్ రంగానికి సంబంధించి సంఘటిత రంగంలో ఉపాధి తగ్గినా తర్వాతి కాలంలో పెరిగింది. 2004 తర్వాత ప్రైవేట్ రంగం సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి 3.8 శాతంగా నమోదైంది.
ఈ కాలంలో ప్రభుత్వ రంగ ఉపాధిలో తగ్గుదల ఏర్పడింది. సంఘటిత రంగంలో వివిధ రంగాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఎక్కువగా ఉంది. మొత్తం సంఘటిత రంగ ఉపాధిలో ఫైనాన్షియల్ సర్వీసులే 9 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్యం వాటా మొత్తం ఉపాధిలో 3 శాతంగా ఉంది. ఇది 1.8 శాతం ఉపాధివృద్ధి పొందింది. మొత్తం సంఘటిత రంగం ఉపాధిలో 22 శాతం వాటాను కలిగి ఉన్న తయారీ రంగానికి ప్రైవేట్ రంగం లో 50 శాతం వాటా ఉంది. 2004-08 మధ్య కాలంలో తయారీ రంగంలో వృద్ధి ప్రైవేట్ రంగంలో 3.8 శాతంగా నమోదైంది.
అసంఘటిత రంగంలో ఉత్పాదకత
సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి పెంపు ఆవశ్యకత ఉంది. వ్యవసాయ రంగం లాంటి అసంఘటిత రంగాల్లో ఉత్పాదకతలో పెరుగుదల లేనప్పుడు సంఘటిత రంగంలో నాణ్యతతో కూడిన ఉపాధి కల్పన సాధ్యం కాదు. ఉత్పాదకతను పెంచడంతోపాటు చిన్న, సన్నకారు కమతాలలో ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించడంలో గ్రామీణ వ్యవసాయేతర రంగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కార్యకలాపాలను పటిష్టపరిచే చర్యలు అవసరం. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగులతోపాటు అదనంగా శ్రామికశక్తికి తోడ య్యే వారికి ఉపాధి అందించే విధంగా చర్యలు చేపట్టాలి.
ఎగుమతులు
ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఎగుమతులు ఆర్థికవృద్ధికి యంత్రంగా ఉపయోగపడగలవని అనుభవ పూర్వక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఎగుమతుల వృద్ధి నాణ్యతతో కూడిన ఉపాధి వృద్ధికి దారితీస్తుంది. భారత్ ఎగుమతుల విలువ 1991లో జీడీపీలో 5.8 శాతం కాగా 2009-10లో 15 శాతానికి చేరుకుంది. భారత్ ఎగుమతులు ఎక్కువగా శ్రమ సాంద్రత ఉత్పత్తుల రకానికి చెందినవి. తద్వారా ఉపాధి పరిమాణం పెంపు, నాణ్యతతో కూడిన ఉపాధికి అవకాశాలు భారత్‌లో ఎక్కువ. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో భారత్‌లో జీడీపీ వృద్ధి కంటే ఉపాధి వృద్ధిలో క్షీణత ఎక్కువగా సంభవించింది.
మరోవైపు భారత్ ఎగుమతుల్లో శ్రమసాంద్రత ఉత్పత్తుల వాటా తగ్గడం ఆందోళన కలిగించే పరిణామం. శ్రమ సాంద్రత ఉత్పత్తుల వాటా భారత్ మొత్తం ఎగుమతుల్లో 1995-96లో 65 శాతం కాగా, 2004-05 నాటికి 50 శాతానికి, 2009-10 నాటికి 1/3 వంతుకు తగ్గాయి. భారత్ శ్రామిక ఉత్పాదకత అమెరికా, జపాన్, ఫ్రాన్స, ఇంగ్లండ్ కంటే తక్కువ. ఉత్పాదకత పెంపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఉపాధి వృద్ధి తగ్గుదలకు దారితీస్తుంది.
గత కొంత కాలంగా భారత్ ఎగుమతుల్లో సేవల ఎగుమతుల వాటా క్రమంగా పెరుగుతోంది. మొత్తం ఎగుమతుల విలువలో వీటి వాటా 36 శాతం వరకు ఉంది. ఇటీవల రవాణా, ట్రావెల్ లాంటి ఇతర సర్వీసుల ఎగుమతుల విలువలోనూ పెరుగుదల ఏర్పడింది. సాఫ్ట్వేర్ సర్వీసులు, వ్యాపారం, ఫైనాన్షియల్ సర్వీసుల ఎగుమతుల విలువలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
భారత్‌లో శ్రామిక చట్టాల్లో మార్పుల ద్వారా ఉపాధి పెంపునకు చర్యలు అవసరం. అధిక జీడీపీ వృద్ధితోపాటు తక్కువ ఉపాధి వ్యాకోచత్వం ఉపాధి వృద్ధికి తోడ్పడటం ద్వారా ఉత్పాదకత పెంపునకు దారితీస్తుంది. నాణ్యతతో కూడిన ఉపాధిని అందించే విధానంలో వేగవంతమైన వృద్ధిరేటు సాధించే వ్యూహం అంతర్భాగంగా ఉండాలి.