
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు నీట మునిగాయి. గుత్తిలో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపోర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని విడపనకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. 15 సంవత్సరాలుగా పారని ఉప్పు వంక, పెద్ద వంకలు పొంగిపొర్లాయి. కొండ ప్రాంతం నుంచి పెద్ద కొండచిలువ కొట్టుకు రావడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63 జాతీయ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బళ్లారి-గుంతకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వజ్రకరూరు మండలంలోని ఛాయాపురంలో వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోనేకల్ వంకకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. గుత్తిలో 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పిన్నెపల్లి చెరువుకు గండి పడింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పిట్టగోడ కూలి బాలిక మృతి
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వెంకటాపల్లిలో ఇంటి పిట్టగోడ కూలి వైష్ణవి అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆదినారాయణ,రాధా దంపతుల కుమార్తె వైష్ణవి. భారీ వర్షాలకు తడిసిన పిట్టగోడ నిద్రిస్తున్న వైష్ణవిపై పడింది. ఈ ఘటనలో వైష్ణవి మృతి చెందటంతో - తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొట్టుకుపోయిన ఇళ్లు, బైకులు
కళ్యాణదుర్గం: పార్వతి నగర్‌లో పాత ఇళ్లు వంకలో కొట్టుకుపోగా అందులో నివసించేవారు సురక్షితంగా బయటపడ్డారు. పట్టణంలోని మారంపల్లి కాలనీలో వంక పారడంతో రెండు ఇళ్లు పూర్తిగా కూలిపోగా, మరో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు చెరువులకు నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలోని పిన్నెపల్లి చెరువుకు గండి పడి యాడికి మండల కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించగా బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. వేములపాడు వద్ద వరద నీటిలో వంద గొర్రెలు, యాభై పశువులు కొట్టుకుపోయాయి.