సాక్షి, హైదరాబాద్: మరోచోట గత్యంతరం లేని ఎమ్మెల్యేలు, నాయకులే ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరైతే విభజనవాదులో... అలాంటి నేతలందరూ ఒక్కచోటికి చేరిపోతున్నారని విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్టీరామారావు ఏర్పాటు చేసిన టీడీపీ.. ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎవరు వచ్చినా కాదనకుండా పార్టీలోకి చేర్చుకునేలా చంద్రబాబు పరిస్థితి తయారైందన్నారు. సోనియాగాంధీ వస్తానంటే చేర్చుకునే స్థితికి ఆయన వచ్చారని విమర్శించారు. చేరేవారికీ సిగ్గులేదు.. చేర్చుకునేవారికీ సిగ్గులేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని, అక్కడ కానిపక్షంలో రాయలసీమలో మరెక్కడైనా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అది రాయలసీమ జన్మహక్కు అని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఈ విషయంపైజగన్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు మాట్లాడకపోవడమేంటని ఆయన తప్పుపట్టారు. వచ్చే ఎన్నికల్లో సీమలోని మొత్తం స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో వాణి వినిపించి సీమ రాష్ట్రం సాధించుకుంటామన్నారు.