bireddy rajasekhara reddy
-
హత్యా రాజకీయాలు బైరెడ్డి నైజం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హత్యా రాజకీయాలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం నైజమని వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. స్మగ్లింగ్, హత్యలు, దొంగసారా వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడించిన బైరెడ్డి బండారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. నాలుగేళ్ల పాటు సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడానికి ఆయనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబం శాంతియుతంగా నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా పాణ్యం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బైరెడ్డి సొంత గ్రామంలో సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సీసీరోడ్డు వేయించానని చెప్పారు. పాణ్యం అభివృద్ధిపై దమ్ముంటే బైరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయంటే హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు సాయిఈశ్వర్‌ను హత్య చేయించడం, రెండు రోజుల క్రితం కర్నూలులో రఘురామిరెడ్డిపై కొడుకు సిద్దార్థరెడ్డితో దాడి చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు బైరెడ్డి మాత్రం అందరూ తన ఆప్తులే అని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఆయన చెప్పించిన తప్పుడు సాక్ష్యాల వల్ల గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డిని ప్రజలు ఎప్పుడో మరచిపోయారని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పార్టీకి 154 ఓట్లు రావడం, గత పాణ్యం ఎన్నికల్లో కూతురు శివానికి 500 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్‌ను కోల్పోవడం నిదర్శనమన్నారు. 2004 నుంచి కూడా తమదే పైచేయి అన్నారు. 2004లో తాను బైరెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో తాము బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని, 2014లో మళ్లీ తానే గెలుపొందానని వివరించారు. ఇప్పుడు ఉనికి కోసమే బైరెడ్డి కుటుంబీకులు హత్యలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రజలకు గౌరు కుటుంబ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బైరెడ్డికి నిజంగా దమ్ము ఉంటే 2019లో జరిగే ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు తీగల కృష్ణారెడ్డి, అబ్దుల్ రహమాన్, ఫీరోజ్, ఓసీఎం రంగ, కరుణాకరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టులో లొంగిపోయారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డి సోమవారం కోర్టుకు హాజరై లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆ క్రమంలోనే తాను లొంగిపోయినట్లు తెలిపాడు. తనకు సాయి ఈశ్వరరెడ్డి హత్య చేయాల్సిన అవసరం లేదని.. రాజకీయంగా దెబ్బతీయడానికే అక్రమ కేసులు బనాయించారని బైరెడ్డి సృష్టం చేశాడు. తన తండ్రి హత్య వెనుక బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఏప్రిల్ నెలలో తనపై పోలీసులు నమోదు చేసిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వాలని బైరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బైరెడ్డి పిటీషన్ ను హైకోర్టు నిరాకరించింది. అప్పట్నుంచీ అజ్ఞాతంలో ఉన్న బైరెడ్డి ఈరోజు కోర్టులో లొంగిపోయాడు. -
బైరెడ్డికి మళ్లీ చుక్కెదురే!
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన హత్య కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో ఆ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న ప్రధాన అభ్యర్థనతో బెరైడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు 3వ టౌన్ పోలీసులు బెరైడ్డి సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బెరైడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను 15న హైకోర్టు కొట్టివేసింది. ఈసారి ఏకంగా ఆ కేసులో ఎఫ్ఐఆర్నే సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రామ్మోహనరావు సోమవారం విచారణ జరిపారు. బెరైడ్డి తరఫున న్యాయవాది ఎం.వి.రాజారాం వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ రాజకీయ కుట్రలో భాగంగానే బెరైడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. అందువల్ల పిటిషనర్ అరెస్ట్ సహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేలా పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... స్టే ఇవ్వడానికి నిరాకరించారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ విచారణను వాయిదా వేశారు. -
గతిలేనివారే టీడీపీలోకి వెళుతున్నారు
సాక్షి, హైదరాబాద్: మరోచోట గత్యంతరం లేని ఎమ్మెల్యేలు, నాయకులే ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరైతే విభజనవాదులో... అలాంటి నేతలందరూ ఒక్కచోటికి చేరిపోతున్నారని విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్టీరామారావు ఏర్పాటు చేసిన టీడీపీ.. ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎవరు వచ్చినా కాదనకుండా పార్టీలోకి చేర్చుకునేలా చంద్రబాబు పరిస్థితి తయారైందన్నారు. సోనియాగాంధీ వస్తానంటే చేర్చుకునే స్థితికి ఆయన వచ్చారని విమర్శించారు. చేరేవారికీ సిగ్గులేదు.. చేర్చుకునేవారికీ సిగ్గులేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని, అక్కడ కానిపక్షంలో రాయలసీమలో మరెక్కడైనా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అది రాయలసీమ జన్మహక్కు అని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఈ విషయంపైజగన్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు మాట్లాడకపోవడమేంటని ఆయన తప్పుపట్టారు. వచ్చే ఎన్నికల్లో సీమలోని మొత్తం స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్లో వాణి వినిపించి సీమ రాష్ట్రం సాధించుకుంటామన్నారు.