మాట్లాడుతున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హత్యా రాజకీయాలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం నైజమని వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. స్మగ్లింగ్, హత్యలు, దొంగసారా వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడించిన బైరెడ్డి బండారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. నాలుగేళ్ల పాటు సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడానికి ఆయనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కర్నూలులోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబం శాంతియుతంగా నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా పాణ్యం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బైరెడ్డి సొంత గ్రామంలో సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సీసీరోడ్డు వేయించానని చెప్పారు. పాణ్యం అభివృద్ధిపై దమ్ముంటే బైరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయంటే హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు సాయిఈశ్వర్‌ను హత్య చేయించడం, రెండు రోజుల క్రితం కర్నూలులో రఘురామిరెడ్డిపై కొడుకు సిద్దార్థరెడ్డితో దాడి చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు బైరెడ్డి మాత్రం అందరూ తన ఆప్తులే అని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఆయన చెప్పించిన తప్పుడు సాక్ష్యాల వల్ల గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డిని ప్రజలు ఎప్పుడో మరచిపోయారని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పార్టీకి 154 ఓట్లు రావడం, గత పాణ్యం ఎన్నికల్లో కూతురు శివానికి 500 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్‌ను కోల్పోవడం నిదర్శనమన్నారు. 2004 నుంచి కూడా తమదే పైచేయి అన్నారు.
2004లో తాను బైరెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో తాము బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని, 2014లో మళ్లీ తానే గెలుపొందానని వివరించారు. ఇప్పుడు ఉనికి కోసమే బైరెడ్డి కుటుంబీకులు హత్యలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రజలకు గౌరు కుటుంబ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బైరెడ్డికి నిజంగా దమ్ము ఉంటే 2019లో జరిగే ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు తీగల కృష్ణారెడ్డి, అబ్దుల్ రహమాన్, ఫీరోజ్, ఓసీఎం రంగ, కరుణాకరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment