సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కూడా టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ వైద్యుడితో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి అడ్డంగా బుక్కయ్యారు. అయితే అయ్యన్న చేసినపనిపై ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెధవ రాజకీయాలు చేయడంపై మండిపడ్డారు.
మొదటి నుంచి అయ్యన్నకు కుట్ర పూరితమైన రాజకీయాలు చేయడం అలవాటేనని ఆయన సోదరుడు తెలిపారు. అయ్యన్న వ్యవహార శైలి ఎప్పుడు వివాదస్పదమేనని గుర్తుచేశారు. ఓడిన ప్రతిసారి అయ్యన్న తీరుమారిపోతుందని అన్నారు. అయ్యన్నను కలవడానికి వెళ్లానని ఒప్పకున్న డాక్టర్‌ను విచారించి అసలు దోషులను శిక్షించాలని పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే..
ఓ వైపు కరోనా రక్కసి విజృంభిస్తుంటే.. మరోవైపు దాన్ని మించి పచ్చ కరోనా వైరస్ విషం చిమ్ముతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మరకలు అంటిండానికి కుట్రలు, కుతంత్రాలతో పెచ్చరిల్లుతోంది. నర్సీపట్నంలో జరిగిన మత్తు డాక్టర్ ఎపిసోడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు నుంచి నర్సీపట్నం వచ్చి బస చేసిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధికారులతో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంటే.. అనస్థీషియా డాక్టర్ సుధాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి రంకెలు వేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆయన రాజకీయాలను ప్రస్తావిస్తూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా బాగుండేదని చేసిన వ్యాఖ్యలతోనే ఇదంతా డ్రామా అని స్పష్టమైంది. ఆ తర్వాత బయటికొచ్చిన వీడియోలతో మొత్తం కుట్ర బట్టబయలైంది. సమావేశానికి ముందు సదరు డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్ళి గంటన్నర సేపు ఉండటం.. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించడంతో మొత్తం స్క్రీన్‌ప్లే అయ్యన్న ఇంటి నుంచే నడిచిందని అర్ధమైంది. డాక్టర్ నిజ స్వరూపమూ బయటపడింది.
వివాదాస్పద ట్రాక్ రికార్డ్
సస్పెన్షన్లు, షోకాజ్‌లు, నిత్యం వివాదాలు.. ఇదే డాక్టర్ సుధాకర్ ట్రాక్ రికార్డ్‌గా కనిపిస్తోంది.. విధులకు ఆలస్యంగా వస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ సంగతి తేలుస్తానంటూ బెదిరించడం, నానాయాగీ చేయడం అతనికి పరిపాటిగా మారింది. గతంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యారు. ఇటీవల నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో వివాదం కూడా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. కరోనా వేళ... సెలవులు కావాలని ఒత్తిడి చేయడం, విధులకు ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా పనిచేయడం.. బరితెగించి టీడీపీ నేతలతో కలిసి కుట్రలకు దిగడం ద్వారా సుధాకర్ వివాదాస్పద తీరు పరాకాష్టకు చేరిందన్న వ్యాఖ్యలు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
చదవండి : డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు
Comments
Please login to add a commentAdd a comment