సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ : పసికందుల విక్రయ వ్యవహారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే పుట్టిన పిల్లను ఇక్కడ పనిచేసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేరొకరికి విక్రయించారన్న వ్యవహారం బయటికొచ్చింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. అక్రమ సంబంధాలతో పుట్టిన పసికందులను, ఆర్థిక ఇబ్బందుల వల్ల గర్భిణులు వదిలి వెళ్లిన మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఆడబిడ్డకు ఒక రేటు, మగ బిడ్డకు ఒకరేటు పెట్టి విక్రయాలు సాగిస్తున్నట్టుగా అధికారులకు తెలియడంతో వారు నివ్వెరపోయారు.
విశాఖ జిల్లా షిప్‌యార్డ్‌కు చెందిన 30 ఏళ్ల వయస్సు గల మహిళ ఈ ఏడాది జూలై 23వ తేదీ ఉదయం ప్రసవం కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. అదే రోజు ఉదయం 9.37 నిమిషాలకు ప్రసవించింది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు డిశ్చార్జ్ అయ్యింది. తనకెవ్వరూ లేరని, తన ఇష్ట పూర్వకంగా వెళ్లిపోతున్నానని చెప్పి, ఆమేరకు రాసిన పేపరుపై వేలి ముద్ర వేసి వెళ్లిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడామె వ్యవహారం ఆసుపత్రి అధికారుల దృష్టికి వచ్చింది. తన పసి బిడ్డను ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారని, అందుకు ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మహిళ ఇదే ఆసుపత్రిలో మరో విభాగం పనిచేస్తున్న ఆమె భర్త మధ్యవర్తులగా వ్యవహరించి, రూ.60వేలకు పసికందును బేరం పెట్టారని బుధవారం ఓ వ్యక్తి ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై ఆరా తీశారు.
క్రయ, విక్రయాల వ్యవహారం ఆసుపత్రిలో జరగలేదని, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జరిగి ఉండొచ్చని నిర్ధారణ వచ్చిన అధికారులు ఆరోజు ప్రసవమైన మహిళ కేస్ షీట్, ఇతర వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే క్రయవిక్రయాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడిది ఆసుపత్రిలో చర్చనీయాంశమై అన్ని విభాగాల్లో కలకలం రేపింది.
ఇప్పటికే అనేక ఘటనలు
గతేడాది నవంబర్ 23న గంటా లక్ష్మికి అప్పుడే పుట్టిన బిడ్డకు టీకాలు వేయించాలని పండు రమణ అనే మహిళ మాయమాటలు చెప్పి బయటికి ఉడాయించింది. సీసీ పుటేజీ ఇతరత్రా ఆధారాలతో ఆ మాయలేడీ రమణను పట్టుకున్నారు. అంతకు ముందు 2010 మేనెలలో ఓ బిడ్డ అపహరణకు గురైంది. పుట్టిన బిడ్డ చనిపోవడంతో అదను చూసుకుని ఓ మహిళ జీజీహెచ్‌లో బిడ్డను తీసుకుపోయింది. పిఠాపురం ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించి, ఆమెను పట్టుకుని బిడ్డను వెనక్కి తీసుకుని ఆ తల్లికి అప్పగించారు. 2016లో ఇదే తరహాలో శిశువును తస్కరించగా, అదే రోజు సాయంత్రానికి కల్లా కిర్లంపూడి ప్రాంతంలో గుర్తించి తల్లికి అప్పగించారు. ఇవి తమ ఆసుపత్రికి మాయని మచ్చగా మిగిలిపోయాయని, అటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేందుకు అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో పసికందు విక్రయ వ్యవహారం దృష్టికి రావడంతో అధికారులు మరింత కలవరం చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment