
సాక్షి, విజయవాడ: రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 23వ తేదీన విజయవాడ రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ గవర్నర్ కుటుంబం
కాగా విశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సమేతంగా తిరుమల రానున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన‍్నవరం బయలుదేరి వెళతారు. కాగా ఈనెల 24వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.