సాక్షి, విజయవాడ : భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణగా నిలిచిందని, దేశంకోసం త్యాగం చేసిన అమరవీరులకు ఇవే మా ఘనమైన నివాళి అంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
(జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్)
నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృసి చేస్తుందన్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రసుతం గ్రామ సచివాలయల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు లభించడం పట్ట హర్షం వ్యక్తం చేశారు. నవశకం ద్వారా అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలాగే ధరల స్థిరీకరణ కింద రూ.3వేలకోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధరల్లో రాయితీ అందజేస్తున్నట్లు విశ్వభూషణ్ వెల్లడించారు. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మొడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.
మనబడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫామ్‌లు, పుస్తకాలు అందజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. పేద వర్గాల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు హాస్టల్ ఫీజులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరచనున్నట్లు , అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణాలు అందజేస్తుందని, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని గవర్నర్ పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు గవర్నర్ హరిచందన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment