అరుణ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
హైదరాబాద్: ప్రేమ పేరిట వంచనకు గురై, ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన నల్లగొండ జిల్లాకు చెందిన అరుణ కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాధితురాలి మృతికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో అరుణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై.. ఈనెల 17వ తేదీన నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.