ఆరిపోయిన అరుణ దీపం | she died by her lover attacks | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన అరుణ దీపం

Published Mon, Dec 23 2013 4:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

తలారి అరుణ - Sakshi

తలారి అరుణ

సాక్షి, న ల్లగొండ/న్యూస్‌లైన్,కనగల్:  ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై.. ఈనెల 17వ తేదీన నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రేమించిన తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు కక్ష పెంచుకుని అరుణపై కర్కశంగా హత్యాయత్నం చేశాడు.

నిలువెల్లా తీవ్రగాయాలైన ఆమెకు మొదటగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 18వ తేదీన కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆమెకు ఐదు రోజులపాటు వైద్యులు చికిత్సనందించారు. 95 శాతానికిపైగా కాలిన గాయాలవడంతో కోలుకోవడం కష్టంగా మారింది. రోజురోజుకూ పరిస్థితి మరింత విషమించి చివరకు ప్రాణాలొదిలింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వ్యక్తి .. ఇక లేదన్న వార్తతో స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
 ఉస్మానియాకు తరలింపు...
 పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం ముగియగానే జిల్లాకు మృతదేహాన్ని తీసుకొస్తామని బంధువులు ‘సాక్షి’కి తెలిపారు.
 రిమాండ్‌లో నిందితుడు...
 సంచలనం రేకెత్తించిన కేసును జిల్లా పోలీసు యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది.  ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుడు సైదులుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర సెక్షన్ల  కింద నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు..
 విద్యార్థుల ఆగ్రహం...
 అరుణ పట్ల దాడిని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థి సంఘాల నేతలు ఈనెల 18వ తేదీన విద్యాసంస్థలకు బంద్‌కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిందితుడి దొష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
 శ్రద్ధాంజలి....
 అరుణ మృతిపట్ల విద్యార్థి సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించాయి. నిందితుడు సైదులుకి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఘటనకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయిు.  జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్, రామగిరి సెంటర్‌లో టీఆర్‌ఎస్వీ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్, టీఎంఎస్‌వీ, బీజేపీ, బీఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రామగిరి సెంటర్‌లో రాస్తారోకో చేశారు.  
 తల్లడిల్లిన కుటుంబం
 అరుణది నిరుపేద కుటుంబం. త ల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పులు చేసి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు.  కూలిపనులు చేస్తు చిన్న కూతురు అరణని చదివిస్తున్నారు. కూతురు పెద్ద చదువులు చదివి వారికింత కూడు పెడుతుందనుకుంటే కళ్ల ముందే కాటికి పోవడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement