
అరుణకు అశ్రునివాళి
అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం
సాక్షి, నల్లగొండ: విద్యార్థిని అరుణ (21) అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన నల్లగొండజిల్లా కనగల్ మండలం కురంపల్లిలో సోమవా రం జరిగాయి. అంతిమ యాత్రకు ప్రజలు, విద్యార్థులు, పార్టీల నేతలు పెద్దఎత్తున హాజరై వీడ్కోలు పలికారు. ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించగా, ఆరు రోజుల పాటు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, అరుణ మృతి పట్ల జిల్లాలోని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. అరుణ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అలాగే, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో అరుణ కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం పరామర్శించారు. అరుణ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.