
పామర్రు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నిధులను మంజూరుచేస్తుంటే వాటిని తమవిగా చెప్పుకుంటూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం వంచిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీనేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పలు పథకాలకు పేర్లు మార్చి జన్మభూమి కమిటీలు చెబితేనే ఇస్తామంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ బినామీలకే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ పన్నుల ద్వారా వచ్చిన నిధులను జన్మభూమి, సీఎం, సీఎం కుమారుడు పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు.
ప్రధాని మోదీ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని దుష్పచారం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. పథకాలకు నిధులు కేంద్రం ఇస్తుంటే ట్యాంక్యూ సీఎం అని మెసేజ్‌లు పెట్టించుకోవడం ఎంత దారుణం అన్నారు. రానున్న ఎన్నికలలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి ప్రకారం విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, నియోజకవర్గ అధ్యక్షులు ఎస్‌పీ నాగేశ్వరరావు, పార్టీనేతలు కాకర్ల సత్యనారాయణ, ఏకె ప్రసాద్, నాంచారయ్య, రామిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు మంజూరు
చిలకలపూడి(మచిలీపట్నం):కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాలకు నిరసనగా బీజేపీ భూ రక్షణ దీక్ష కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్ సమీపంలో నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు ఇంత రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కో–ఇన్‌చార్జ్ సునీల్ థియోడర్ మాట్లాడుతూ చంద్రబాబు దొంగ కాదని గంజ దొంగగా అభివర్ణించారు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల వారు కూలీ, నాలీ చేసుకుంటూ సంపాదించుకున్న భూమిని కూడా వదలకుండా లాక్కోవటం దుర్మార్గమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుకు కుటుంబరావు, బుద్దా వెంకన్నలు బ్రోకర్లుగా మారారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, తురగా నాగభూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీఆర్ రవీంద్రరాజు, మైనార్టీ మోర్చ నాయకులు షేక్ బాజీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఆలపాటి లక్ష్మీనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూనపరెడ్డి శ్రీనివాసరావు, నాయకులు పంతం గజేం ద్ర, వైవీఆర్ పాండురంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment