చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు అసహనం
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. స్కూళ్లకు 100 మీటర్లలోపు ఉన్న మద్యం దుకాణానికి లైసెన్స్ ఇవ్వొద్దన్నా మంజూరు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో విసిగిపోయిన నేను ఈ నెల 17న విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చా. నా నియోజకవర్గ పరిధిలో 13 బార్లు, 14 వైన్ షాపులు ఉన్నాయి. అందులో 8 మద్యం షాపులు వద్దంటూ ఎమ్మెల్యే గా వినతిపత్రం ఇచ్చాను.
అతి దారుణంగా మా లేఖలు ఓ చిత్తు కాగితంగా తీసి పక్కన పడేశారు. అశోకా వైన్స్‌కు లైసెన్స్ ఇచ్చేశారు. ఏదైనా మేం వినతిపత్రం ఇస్తే బుట్టదాఖలు చేయొద్దు. విశాఖలో వైన్స్ మాఫియాను ఎక్సైజ్ సూపరింటెండెంట్ అడ్డుకుంటున్నా...అమరావతి నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. మళ్లీ లైసెన్స్‌లను ఇప్పించుకుంటున్నారు.’ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.