- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకి!
- చంద్రబాబు-దత్తాత్రేయ సమక్షంలో తుది నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ-టీడీపీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినా తాజాగా కలిసి ముందుకు సాగాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నాయి. త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ పాలకమండలి ఎన్నికలు, ఆ తర్వాత జరగాల్సిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అవగాహనకు వచ్చాయి.
ఆదివారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి ఆయనను ‘మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. దత్తాత్రేయ వెంట బీజేఎల్పీ నేత లక్ష్మణ్, ఉప నేత చింతల రామచంద్రారెడ్డిరాగా.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, ఎల్.రమణ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ స్థానాలు కమలానికే..
త్వరలో ఖాళీ కాబోతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయవద్దని టీ టీడీపీ నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి వ్యాపార వేత్త కల్లెడ రామమోహన్‌రావు పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
టీఆర్‌ఎస్-మజ్లిస్ కలిసిసాగే అవకాశమున్నందున బీజేపీ-టీడీపీ మధ్య కూడా అవగాహన అవసరమనే అభిప్రాయపడ్డట్టు తెలిసింది. శనివారం బీజేపీ, టీడీపీ నేతలు ప్రాథమికంగా చర్చించించిన అంశా లను ఆదివారం దత్తాత్రేయ-బాబు భేటీ సందర్భంగా వివరించి తుది నిర్ణయం తీసుకున్నారు.