ఆచంట : కేంద్ర ప్రభుత్వ పథకాలను హైజాక్ చేసి టీడీపీ పబ్బం గడుపుకుంటోందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు విమర్శించారు. ప్రధాని మోడీ చేపడుతున్న పనులకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి లభిస్తోందని, అయితే రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులు, పథకాలకు కేంద్రం ఊసే లేకుండా పసుపు రంగు పులిమి, పక్కన చంద్రన్న బాట అంటూ బోర్డులు తగిలించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆచంట మండలంలో పలు రహదారులను ప్రారంభించిన అనంతరం పెదమల్లం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముచ్చెర్ల నాగ సుబ్బారావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ గంగరాజు పరోక్షంగా అధికార టీడీపీపైనా, మంత్రి పితాని సత్యనారాయణపైనా మండిపడ్డారు. టీడీపీ సహకరించకపోయినా ఏనాడూ అభివృద్ధి పనులు ఆపలేదన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తే టీడీపీ నేతలు రాకపోగా ప్రజాప్రతినిధులు, అధికారులను సైతం రాకుండా చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రూ 10 లక్షలు తక్కువ కాకుండా నిధులు కేటాయిస్తుంటే టీడీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో పెద్ద ఎత్తున స్కాం జరుగుతోందని, ర్యాంపుల్లో రౌడీ రాజకీయం నడుస్తోందని గంగరాజు వ్యాఖ్యానించారు. ఎవరైనా సాయం చేస్తే విశ్వాసం ఉండాలన్నారు. నియోజకవర్గ బీజేపీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల కబర్ధి, జాతీయ కాయర్ బోర్డు సభ్యుడు పీవీఎస్ వర్మ, పార్టీ నాయకులు గోపావఘుల మాధవశర్మ, రఘుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment