
బీజేపీలో 'నాగం'కు ఎగనామం?
హైదరాబాద్ : సైకిల్ దిగి కమలం చేతబూనిన నాగం జనార్థన్ రెడ్డికి ఆపార్టీలో ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో నిర్మించ తలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా విగ్రహ నిర్మాణం లక్ష్యంగా జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు నాగంకు ఆహ్వానం అందకపోవటంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతల ఢిల్లీ పర్యటనకు నాగం జనార్థన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు. దాంతో నాగం అనుచరులు మండిపడుతున్నారు.
పార్టీలో కావాలనే నాగంకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన నాగం.... తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆయనకు పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత మాత్రం లభించటం లేదు. అదే జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే యెన్నం లక్ష్మీనారాయణకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా నాగంకు ఇవ్వటం లేదని ఆయన మద్దతుదారులు వాపోతున్నారు.