
పాలి‘ట్రిక్స్’లో ఓపికుండాలి గురూ!..
రాజకీయాల్లో నాయకులకు శక్తిసామర్థ్యా లు, అపారమైన అనుభవంతో పాటు ఆటుపోట్లకు తట్టుకుని వ్యవహరించే ఓపిక, టైమింగ్, నిలకడ కూడా ఉండాలని విశ్లేషకులు తరచుగా చెబుతుంటారు. రాజకీయ అనుభవం కలిగి ఉన్నా ఇవి లేకపోతే రాజకీయ వైకుంఠపాళిలో ఎదురుదెబ్బలు తప్పవంటున్నారు. సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉండి అనేక మంత్రి పదవులను నిర్వహించిన నాగం జనార్ధనరెడ్డి ప్రస్తుతం కుదురుగా బీజేపీలోనే కొనసాగితే ఎన్నో పదవులతో పాటు, వి.రామారావు మాదిరిగా భవిష్యత్‌లో ఏ ఈశాన్య రాష్ట్రానికో గవర్నర్ పదవి కూడా దక్కి ఉండేది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా ‘తెలంగాణ బచావో’ అంటూ సొంతంగా గళమెత్తడం ‘కౌంటర్ ప్రొడక్టివ్’ తప్ప మరొకటి కాదని నిపుణులు అంచనావేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఎన్ని ఇబ్బందులు పడినా చివరకు పీవీని ప్రధాని పదవి వెదుక్కుంటూ రావడానికి ఆయన ఓపికగా ఉండడమే కారణమని ఉదహరిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నజ్మాహెప్తుల్లా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో విభేదించి బీజేపీలో చేరి ఉండకపోతే రాష్ట్రపతి పదవో. ఉప రాష్ట్రపతి పదవో దక్కి ఉండేదంటున్నారు. బీజేపీలో చేరినా ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నందున ఆమె సీనియారిటీకి జాతీయస్థాయి పదవే దక్కిందని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు రాజకీయ వనవాసం చేసినా ఆ పార్టీలోనే ఉన్నందున, పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఆరీ్టిసీ చైర్మన్‌గా పలుపదవులను పొందడాన్ని ఉదహరిస్తున్నారు.
అదేసమయంలో కాంగ్రె స్‌లో సీనియర్‌నేతగా ఉన్న పి.శివశంకర్ 2004 ఎన్నికలకు ముందు అసంతృప్తితో పార్టీ నుంచి దూరం పాటించకపోయి ఉంటే మరో ఉన్నతస్థాయి పదవి లభించి ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీని కాదని అనుకున్నా అటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలలోకి వెళ్లలేక, సొంతగూడు టీడీపీలోకి వెళ్లేందుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేక నాగం ఏం చేస్తారన్నది పెద్దప్రశ్నగా మారిందంటున్నారు. పార్టీ క్రమశిక్షణను కాదని తిరుగుబాటు జెండాను ఎగురవేస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగకపోగా, నేడో, రేపో బీజేపీ నుంచి కూడా ఉద్వాసన తప్పదని వారు సెలవిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తొందరపాటుతో నాగం ఆగమైపోయారంటున్నారు.