'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం'
హుస్నాబాద్: తెలంగాణ భూములు.. నీళ్లపై గవర్నర్, సీమాంధ్రుల పెత్తనం వద్దని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్‌లోని భూములపై గవర్నర్‌కు అధికారం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని, సీమాంధ్రులు అక్రమించుకున్న భూములు చట్టపరంగా పేదలకు పంపిణీ జరగాలంటే ఎవరి పెత్తనమూ ఉండవద్దని అన్నారు. తెలంగాణపై ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఉద్యమాలు, త్యాగాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు అమరుల త్యాగాలను అవమానపరచడమేనని అన్నారు.
1948 నుంచి భూములపై అంక్షలు ఉన్నా సీమాంధ్రులు వాటిని ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 85 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు సామాజికన్యాయం జరగాలంటే ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పడాలన్నారు. రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలన్నారు. సీమాంధ్ర డిపాజిట్లను బ్యాంకుల్లో భద్రపరుచుకుని తెలంగాణపై జాయింట్ చెక్‌పవర్ కావాలంటున్నారని ఆయన విమర్శించారు.