బీజేపీకే ఆ సీటు!
- అనవసరమైన లొల్లి చేయొద్దు
- పిలిచేంతవరకు రాజధానికి రావద్దని హుకుం
- జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్న ముఖ్యనేత ద్వారా ఆదేశాలు
సాక్షి, తిరుపతి: పొత్తుల్లో భాగంగా మదనపల్లె అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోంది. నియోజకవర్గ నాయకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకునేది లేదని అధినేత చంద్రబాబునాయుడు సంకేతాలు పంపినట్టు సమాచారం. ఈ స్థానం బీజేపీకి కేటాయిస్తే పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని ఆశావహులు బహిరంగంగా ప్రకటనలు చేయడంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
మదనపల్లె స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని నిలపాలని ఆ పార్టీ టికెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, బోడేపాటి శ్రీనివాస్, రాందాస్‌చౌదరి తదితరులు శుక్రవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు బీజేపీకే వదిలేస్తే తెలుగుదేశం ఉనికి కోల్పోతుందంటూ శాపనార్థాలు పెట్టడం పార్టీ అధిష్టానం ఆగ్రహానికి దారితీసింది. వెంటనే ఇటువంటి ప్రకటనలు మానుకోవాలని మదనపల్లె నాయకులకు జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్న ముఖ్యనేత ద్వారా చ ంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదే విషయమై చర్చించేందుకు రాజధానికి రావద్దని కూడా హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. పరిధి దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణచర్యలు తప్పని కూడా స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అవసరమైన పక్షంలో తామే పిలిపిస్తామని కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 7వ తేదీన రాజధానికి వెళ్లే విషయంలో ఆశావహులు పునరాలోచనలో పడ్డారు. పార్టీ అధినేతకు తమ అభిప్రాయాలను స్వయంగా తెలియజేసేందుకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోయిందని వారు అంతర్గతంగా మదనపడుతున్నారు.
ఆశావహులతో వేర్వేరుగా...
మదనపల్లె టీడీపీ టికెట్టు ఆశిస్తున్న నాయకులతో మూకుమ్మడిగా మాట్లాడడం కన్నా వేర్వేరుగా చర్చించడం ఉత్తమమనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. విడివిడిగా చర్చించి ఏదో ఒక రకంగా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ బాధ్యతలు ఒక ముఖ్యనాయకునికి అప్పగిం చాలని భావిస్తున్నారు. దీంతో విభజించు పాలించు సూత్రాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి మదనపల్లె తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రభావం ఆదివారం జరిగే పరిషత్ ఎన్నికలపై కూడా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.