ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండానే అధికారం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందోనని రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ తరువాత కేంద్రంలో జనతా ప్రభుత్వం, 1983లో రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో, 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం అలాగే వస్తుందని జోస్యం చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త వాసుదేవ ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, పొత్తుల రాజకీయాలతో కేంద్రంలో ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మరోసారి పార్లమెంట్‌లో ఈ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీని, మోడీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రానున్న మూడు నెలల్లో కార్యకర్తలు బీజేపీ విధానాలను గ్రామగ్రామానికి, నగరంలో ఇంటింటికీ చేరవేయాలని కోరారు. రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.