సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): సంచనాలకు మారు పేరు అయిన రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్ మరో సంచలనానికి వేదికైంది. కొంతకాలం క్రితం పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రసూతి విభాగంలో చేరిన ఒక గర్భిణికి ఆపరేషన్ చేసి పురుడుపోశారు. అనంతరం కడుపులో బ్లేడ్ మరిచిపోయి కుట్లు వేసేశారు. దీనితో మహిళకు కడుపు నొప్పి తరచూ రావడంతో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో వైద్యం చేసేందుకు ఉపయోగించే బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినట్లు గుర్తు రావడంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరారు. అయితే ఆ మహిళ వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై హాస్పటల్ సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టి రాలేదన్నారు.