
ఆర్చేదెవరు? తీర్చేదెవరు?
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో పాలనాపరమైన ప్రతిష్టంభన నెలకొంది. అక్కడి ప్రజలు పడుతున్న పాట్లు సర్కారు చెవికెక్కడం లేదు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో పాలనాపరమైన ప్రతిష్టంభన నెలకొంది. అక్కడి ప్రజలు పడుతున్న పాట్లు సర్కారు చెవికెక్కడం లేదు. ‘తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి’ అన్న చందంగా తమ ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసి విడిచి పెట్టేశారన్న ఆ మండలాల ప్రజల ఆవేదన అరణ్య రోదనగానే ఉంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఏడింటిని (చింతూరు, కూనవరం, భద్రాచలం (పట్టణం మినహా), వీఆర్‌పురం, కుకునూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు) ఏపీలో విలీనం చేశారు. ఆ తర్వాత వారి బాగోగులను చూసే అధికారే లేకుండా పోయాడు. ఆ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కొక్కరిని తెలంగాణకు బదిలీ చేసేస్తుంటే ఏపీ సర్కారు గుడ్లప్పగించి చూస్తుందే తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారి మానాన వారిని వదిలేస్తోంది. విలీన ప్రక్రియ ముగిసి, గెజిట్ కూడా విడుదలైనా ప్రభుత్వం ఆ మండలాల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమంటున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమైన ఏడు మండలాల పరిధిలో లక్షన్నర పై చిలుకు జనాభా ఉంది. అంత మంది దైనందిన పాలనా వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ముంపు మండలాల్లో ఉన్న ఉద్యోగులందరినీ తెలంగాణకు బదిలీ చేసుకునేందుకు ఆ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ క్రమంలోనే గత కొద్ది రోజులుగా విలీన మండలాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులను తెలంగాణ కు బదిలీ చేస్తూ అక్కడి సర్కారు ఉత్తర్వులిస్తోంది. శుక్రవారం విలీన మండలాల పరిధిలో వ్యవసాయ శాఖలో వివిధ కేడర్‌లలో పనిచేస్తున్న 15 మంది అధికారులను, శనివారం పశుసంవర్ధక శాఖ ఉద్యోగులను తెలంగాణ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరిలో నలుగురు పనిచేసే ప్రాంతం (ఆంధ్రప్రదేశ్)లోనే ఉంటామని ఇదివరకే ఆప్షన్ ఇచ్చారు. అయినా పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణకు బదిలీ చేయటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటువంటప్పుడు ఏ రాష్ట్రంలో పనిచేస్తారంటూ ఆప్షన్‌లు ఎందుకు తీసుకున్నారని ఏపీకి వెళ్లేందుకు అంగీకారం తెలిపిన ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
సలహా ఇచ్చే నాథులు కరువు
తెలంగాణ సర్కారు తాజా నిర్ణయంతో ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో వ్యవసాయశాఖ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ మండలాల్లో సుమారు 75 వేల ఎకరాల్లో వరి, మరో 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. సాగుపై ఏ చిన్న అవసరం, సలహా కావాలన్నా రైతుకు చెప్పే నాథుడే లేకుండా పోయాడు. అయినా ఏపీ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు. వ్యవసాయశాఖను ఖాళీ చేసిన తెలంగాణ సర్కారు శనివారం పశుసంవర్ధకశాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టింది. విలీన మండలాల పరిధిలో ఆ శాఖలో 18 పోస్టులుండగా శనివారం 15 మందిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసింది. రెండు శాఖల్లో ఉన్న మొత్తం అధికారులందరినీ రెండు రోజుల వ్యవధిలో బదిలీ చేయడంతో రైతులు, పాడిపై ఆధారపడ్డ కుటుంబాలకు దిక్కు ఎవరని విలీన మండలాల వారు ఏపీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు.
ప్రజా సమస్యలపై చిన్నచూపు
ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో మొత్తం 3,142 పోస్టులుండగా, అందులో 969 ఖాళీగా ఉన్నాయి. 2,173 మంది పనిచేస్తుండగా, ఇందులో 1,585 మంది తెలంగాణకు వెళ్తామంటే, 588 మంది పని చేసే చోటే అంటేఆంధ్రలోనే ఉంటామన్నారు. కానీ దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపటం లేదు. మెజారిటీ అధికారులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడం, పాలన ఏపీ నుంచి నడుస్తుండటంతో ప్రజా సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ఉన్నతాధికారులు ఆయా మండలాలకు వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమౌతోంది. జిల్లా విద్యాశాఖాధికారి నెల్లిపాకలో, డీఎంహెచ్‌ఓ కూనవరంలో నిరసనను ఎదుర్కొనడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి కూడా తెలంగాణ అధికారుల సహాయ నిరాకరణతో నామ్ కే వాస్తేగా సాగుతోంది. ఇప్పటికైనా ఏపీ సర్కారు అలసత్వాన్ని వీడి అధికారులు, ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకోవాలి.