బంగారుతల్లిపై నీలిమేఘాలు
- కొద్ది మందికే అందిన ఆర్థిక సాయం
- బాండ్లు పంపిణీ నిలిపివేత
పిఠాపురం: బాలికా సంరక్షణకు గత రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన బంగారుతల్లి పథకం అమలుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఏడాదిపాటైనా పూర్తి స్థాయిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఆపథకం పేరుతో ఆడపిల్ల పుడితే వారింట బంగారమే అనుకున్న లబ్ధిదారులకు బాండ్లే బంగారంగా కనిపిస్తున్నాయి తప్ప ఆర్థిక సహాయం మాత్రం అంద లేదు. అధికారులు బాండ్ల పంపిణీని సైతం నిలిపివేయడంతో ఈపథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈపథకం కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 19,682 మంది దరఖాస్తు చేసుకోగా 9,722 మందిని అర్హులుగా గుర్తించి ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడత ఆర్థిక సహాయం కింద రూ. 2,43,5000 విడుదల చేశారు. అలాగే జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీల్లో 1,250 మంది దరఖాస్తు చేసుకోగా 456 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి కూడా అప్పట్లో బాండ్లను పంపిణీ చేశారు. ఆ బాండ్లపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండడంతో వాటిని నిలిపి వేసిన అధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక పోవడంతో కొత్త బాండ్లు డిజైన్ చేసే వరకు కేవలం ఎన్‌రోల్ మెంటు మాత్రమే చేస్తున్నారు.
బంగారు తల్లి పథకంలో సాయం అందేదిలా...
ఈపధకంలో బాగంగా పుట్టిన నాటినుంచి ఆస్పత్రిలో ప్రసవం ఇతర ఖర్చుల కోసం రూ, 2500 ఆతరువాత, టీకాల కోసం రూ, వెయ్యి, అంగన్‌వాడీ చదువులకు ఏడాదికి రూ, 1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ, 2 వేలు ఆర్దిక సహాయం అందించాలి.అలాగే ఆరు నుంచి ఏడో తరగతి వరకు ఏడాదికి రూ, 2500, ఎనిమిదోతరగతి వరకు ఏడాదికి రూ, 2500, తొమ్మిది నుంచి పదోతరగతి వరకు ఏడాదికి రూ, 3వేలు, ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ, 3500 , గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ, 4వేలు దశల వారీగా అందించడం ఈపథకం లక్ష్యం. అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్మీడియట్ తరువాత రూ. 55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ. లక్ష కలిపి రూ. 1.55 లక్షలు ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు.
సాధారణంగా ఈపధకంలో ఎంపికైన లబ్దిదారుల పిల్లలకు సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కోక్కరికి రూ, 2500 చొప్పున నిధులు వారివారి బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే బాండ్లు పంపిణీ చేసి నెలలు కావస్తున్నా జిల్లాలో ఇప్పటికి 10,500 మంది ఖాతాలో డబ్బు జమకాకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పధకం ప్రారంభించి ఏడాది పూర్తవ్వడంతో ప్పటికే తొలి విడత పొమ్ము జమైన వారికి మలి విడతగా టీకాల కోసం ఇవ్వాల్సిన సొమ్ము ఇప్పటి జమకాక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.