టిస్కా చోప్రా
9 నుంచి 13 ఏళ్ల వయసులో ఉండే అమ్మాయిలకు ఎన్నో సందేహాలు. తమ శరీర మార్పుల గురించి. వాటికి సమాధానం మనం చెప్పం. వారే తెలుసుకోవాలి. ఆ వయసు తర్వాత వాళ్లు ‘ఆడపిల్లలు’ గా సమాజం నుంచి ప్రత్యేకం కాబడతారు. ఎందుకు అలా? వారిని వారికి తెలియచేద్దాం... వారిని సమాజంలో ఒక భాగం చేద్దాం అంటున్నారు నటి టిస్కా చోప్రా. తొమ్మిదేళ్ల కూతురు ఉన్న టిస్కా బాలికల కోసమే ‘వాట్స్ అప్ విత్ మీ’ పుస్తకం రాసి వెలువరించారు.
‘వాట్స్ అప్ విత్ మీ’ అనేది టిస్కా చోప్రా రాసిన పుస్తకం పేరు. దాని కింద ప్యూబర్టీ, పిరియడ్స్, పింపుల్స్, పీపుల్, ప్రాబ్లమ్స్ అండ్ మోర్ అనే ట్యాగ్‌లైన్. దీనిని బట్టి ఆ పుస్తకం ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. 47 ఏళ్ల టిస్కా ‘తారే జమీన్ పర్’ నటిగా దేశానికి తెలుసు. ఆమె చేసిన ‘చట్నీ’ అనే లాంగ్ షార్ట్‌ఫిల్మ్ ఆమెకు విపరీతమైన ఖ్యాతి తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌లో, టెలివిజన్‌లో, నాటక రంగంలో టిస్కా చాలా భిన్నమైన పాత్రలనే చేయడానికి ఇష్టపడుతుంది. అదీగాక ఆమె రచయిత్రి కూడా గతంలో ఆమె ‘యాక్టింగ్ స్మార్ట్: యువర్ టికెట్ టు షోబిజ్’ పుస్తకం రాసింది. ‘వాట్స్ అప్ విత్ మీ’ ఆమె రెండోపుస్తకం.
కూతురి కోసం
‘ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు. ‘రెడ్ పాండా’ పబ్లికేషన్స్ ఎడిటర్ విధి భార్గవ నా బుర్రలో వేసింది. లాక్‌డౌన్‌లో నేను ఇంట్లో ఉండటం కూడా ఈ ఆలోచన పెరగడానికి కారణమైంది. ఇక తొమ్మిదేళ్ల నా కూతురు మరో ముఖ్యకారణం. నా చిన్నప్పుడు పిరియడ్స్ గురించి అడిగితే అదొక అసహ్యకరమైన విషయంగా మా పెద్దలు ఆ విషయాన్ని చర్చించేవారు కాదు. దాని గురించి రకరకాలుగా సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా కన్ఫ్యూజన్‌ని, ఆందోళనని కలిగించేది.
నా కూతురును మాత్రం అలా నేను చేయదలుచుకోలేదు. మా ఇంట్లో లైంగిక అవయవాలను సంకేతపదాలతో మాట్లాడము నేను కాని నా భర్త కాని. వాటికి సంకేత పదాలు వాడటం వల్ల వాటి చుట్టూ నిగూఢత ఏర్పడుతుంది. దాని నుంచే సందేహాలు అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయిలకు అమ్మాయిల గురించి, అబ్బాయిలకు అబ్బాయిల గురించి ఇద్దరికీ పరస్పరం సమాచారం ఉండాలి. దాని గురించి మనమంతా ఆలోచించాలి. నా పుస్తకం ఒక మేరకు జరిగిన ప్రయత్నంగా భావిస్తాను’ అంటోంది టిస్కా.
సరదాగా సమచారం
‘నా పుస్తకంలో సమాచారాన్ని సరదాగా ఉండేలా చూశాను. చాలా బొమ్మలు ఉంటాయి. వాటి ద్వారా ఆడపిల్లలకు తమ శరీరాల్లో జరిగే మార్పులు, తద్వారా వచ్చే ఆందోళనల గురించి తెలుస్తుంది. పిరియడ్స్ గురించి జరిగే షేమింగ్ తెలుస్తుంది. దాని గురించి భయపడేది సిగ్గుపడేదీ ఏమీ లేదని చెబుతాను. అవి వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ప్యాడ్స్ గురించి కప్స్ గురించి సమాచారం ఉంటుంది. అసలు ఆడపిల్లలు ధైర్యంగా మెడికల్ షాప్‌కు వచ్చి ప్యాడ్స్‌ని కొనే, అలాగే మెడికల్ షాప్ వాడు దానిని న్యూస్‌పేపర్ లో చుట్టకుండా ఇచ్చే రోజులు రావాలి. ఆడపిల్లల తండ్రులు తమ కుమార్తెల కోసం శానిటరీ పాడ్ కొనగలగాలి. నా పుస్తకం తండ్రులకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆడపిల్లల తండ్రులు కూడా తమ కుమార్తెల మనసుల్లో ఏముందో ఏం సందేహాలున్నాయో తెలుసుకుని వారిని తేలిక పరచాలి. మన ఇళ్లల్లో తల్లికి ఈ బాధ్యత అప్పజెబుతారు. తల్లి వాటికి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు’ అంటారు టిస్కా.
నిపుణుల సహాయంతో...
టిస్కా ఈ పుస్తకం టీనేజ్‌ను దాటిన ఒక స్త్రీ అవగాహనతో రాసినా, నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా అరోరా (గైనకాలజిస్ట్), కెనడాలో ఉంటున్న మాళవిక వర్మ (సైకాలజిస్ట్) తమ ఇన్‌పుట్స్ ఇచ్చి బాలికల భౌతిక, మానసిక మార్పులకు సంబంధించి వారికి వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ‘టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు సరైన అవగాహన కల్పించడం వల్ల మెన్‌స్ట్రువల్ హైజీన్ తెలుస్తుంది. లైంగిక అవయవాల ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుకోగలుగుతారు. టీనేజ్ ప్రెగ్నెన్సీల బారిన పడకుండా ఉంటారు’ అని డాక్టర్ మాలా అరోరా అంటారు.
ఏమైనా టిస్కా అరోరా రాసిన ఈ పుస్తకం లాంటి పుస్తకాల అవసరం చాలా ఉంది. తెలుగులో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి... స్కూల్ పిల్లలకు చదువుకునే విధంగా వారికి ఏ మేరకు అందుతున్నాయన్నది సందేహాస్పదం. మన సెలబ్రిటీలు ఇలాంటి ఆలోచనలు చేస్తే వారి స్టేటస్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ పుస్తకాలను చేరవేయవచ్చు.
సమాజంలో జరుగుతున్న దుష్పరిమాణాలు చూసినప్పుడు బాలికల శారీరక, లైంగిక చైతన్యం గురించి ఎంతో పని సాగాలని తెలుస్తోంది. ఆ పని టిస్కా చేసినందుకు ఆమెకు తప్పకుండా అభినందనలు తెలిపి తీరాల్సిందే.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment