తారలు గర్భం దాల్చే విషయంలో చాలా వొత్తిడి ఉంటుంది. కెరీర్‌కు వచ్చే బ్రేక్ వల్లా శరీరంలో వచ్చే మార్పు వల్లా ఆ వొత్తిడి వారికి యాతన అవుతుంది. కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నటిగా టాప్ లెవల్‌లో ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం... ఇవి తన మీద చూపే వొత్తిడి ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా కలగవచ్చని ఆమెకు అనిపించింది. అసలు గర్భధారణ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం రాసి ఆమె విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఇది కచ్చితంగా ఉపయుక్తమే.
2018లో భారతదేశంలో హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆథర్ ఎవరో తెలుసా? ఊహించండి. నటి ట్వింకిల్ ఖన్నా. ఆమె రాసిన ‘పైజామాస్ ఆర్ ఫర్‌గివింగ్’ పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమె సినీ నటి అనో, అక్షయ్ కుమార్ భార్య అనో ఆ పుస్తకం అమ్ముడుపోలేదు. దానిలో ఉన్న సరదా విషయాలు, వాటిని రాసిన ట్వింకిల్ ఖన్నా శిల్పం ఆ పుస్తకానికి పేరు తెచ్చాయి. బాలీవుడ్‌లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకున్న నటి ట్వింకిల్. ‘మిసెస్ ఫన్నీబోన్’, ’ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ ఆమె ఇతర పుస్తకాలు. నటి శిల్పా శెట్టి రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకం కూడా హిట్ అయ్యింది.
‘ఆషికీ’ సినిమాలో నటించి ఆ తర్వాత ప్రమాదం బారిన పడి అదృశ్యమయ్యి తిరిగి చాలా ఏళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన అనూ అగర్వాల్ రాసిన ‘అన్‌యూజ్వల్’ పుస్తకం పాఠకులు పెద్ద ఎత్తున కొన్నారు. నటి ప్రియాంక చోప్రా తన రచనలను, వ్యాసాలను ‘అన్‌ఫినిష్డ్’ పేరుతో పుస్తకంగా తెచ్చింది. ఇలా బాలీవుడ్ లోని మహిళా సెలబ్రిటీలు తాము నటనలోనే కాదు కలం పట్టి రాయడంలోనూ ప్రతిభ ఉన్నవాళ్లం అని నిరూపించారు. అదే వరుసలో ఇప్పుడు కరీనా కపూర్ కూడా చేరింది. ఆమె గతంలో ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ డైరీ’ అనే పుస్తకం తెచ్చింది. అందులో స్త్రీలకు అలంకరణ కిటుకులు తన అనుభవాల నుంచి చెప్పింది. ఇప్పుడు ఆరోగ్య రహస్యాలు చెప్పేందుకు కొత్త పుస్తకంతో వచ్చింది. దాని పేరే ‘ప్రెగ్నెన్సీ బైబిల్’.
వేడి వేడి పుస్తకం
కొన్నిరోజుల క్రితం కరీనా కపూర్ తన చేతిలో ఒక ఆల్ట్రాసౌండ్ రిపోర్ట్ పట్టుకుని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ‘ఒక పని మీద ఉన్నా. అయితే మీరు ఊహించేదే కాదు. విశేషాల కోసం ఎదురు చూడండి’ అని ఆ పోస్ట్‌లో క్యాప్షన్ రాసింది. అది చాలా వైరల్ అయ్యి బోలెడన్ని ఊహాగానాలు వచ్చాయి. దాని కొనసాగింపుగా తాజా పోస్ట్ వచ్చింది. అందులో కరీనా ఒక బేకింగ్ ట్రే నుంచి తన తాజా పుస్తకాన్ని బయటకు తీసి ‘వేడి వేడిగా ఇప్పుడే బయటకు వచ్చింది’ అని చూపించింది. ‘ఇది నా మూడోబిడ్డ. ఇన్నాళ్లూ దీని పనిలోనే ఉన్నా’ పుస్తకాన్ని తేవడం కూడా బిడ్డను కనడంతో సమానం అని వ్యాఖ్యానించింది. అందుకే ఆమె తన మునపటి పోస్ట్‌లో ఆల్ట్రాసౌండ్ స్కాన్ చూపింది.
గర్భిణుల సర్వస్వం
గర్భధారణ గురించి, గర్భం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రసవం గురించి గతంలో అనేక పుస్తకాలు వచ్చాయి. అవి ఎక్కువ భాగం వైద్యనిపుణులు రాసినవి. అయితే ఇప్పుడు కరీనా రాసిన పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ కొంత భిన్నమైనది. ఒక ప్రసిద్ధ నటి తన సహజమైన సందేహాలకు తెలుసుకున్న సమాధానాలను, పాటించిన జాగ్రత్తలను, అందులో ఎప్పటికప్పుడు ఎదురైన సమస్యలను తన దృష్టికోణం నుంచి చెప్పడమే ఈ పుస్తకం ప్రత్యేకత.
అంతే కాదు ఉద్యోగం/కెరీర్‌లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. ఆమె ఈ పుస్తకాన్ని తన జ్ఞానంగా కాక గైనకాలజిస్ట్‌ల సాయంతో చేశానని వారి పేర్లు కూడా ప్రస్తావించింది. ఈ పుస్తకాన్ని ఎఫ్.ఓ.జి.ఎస్.ఐ (ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్‌టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) కూడా ఆమోదించడంతో ఇందులో ఉన్నది అథెంటిక్ సమాచారం అని చెప్పవచ్చు.
మంచి చెడ్డా
‘నా తోటి హీరోయిన్లు పనిలో దూసుకుపోతుంటే నేను మంచం మీద నుంచి దిగలేని స్థితిలో ఉన్నాను. గర్భధారణ సమయంలో కొన్ని మంచి అనుభూతులు కలుగుతాయి. కొన్ని చెడు చిరాకులు రేగుతాయి. ఎన్నో సందేహాలు ఉంటాయి. మానసికంగా భౌతికంగా నేను ఎదుర్కొన్న సమస్యలకు పొందిన సమాధానాలను వ్యక్తిగత దృష్టికోణం నుంచి నేను తెలియచేశాను’ అని కరీనా తెలియచేసింది. ‘దీని ఆలోచన నుంచి పుస్తకం బయటకు రావడం వరకూ కూడా ఒక జననం లాంటిదే. అందుకే ఇది నా మూడో బిడ్డ’ అని ఆమె అంది.
ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, ఇంటి పెద్దలు కలవడానికి వీలైన కుటుంబ జీవనం లేకపోవడం, బిజీ లైఫ్... ఇవన్నీ ఇప్పుడు గూగుల్ ద్వారానో పుస్తకాల ద్వారానో సందేహాలు తీర్చుకునే స్థితికి తీసుకెళ్లాయి. ఆ విధంగా చూసినప్పుడు కాబోయే తల్లుల కోసం ఈ పుస్తకం రాసి ఇక్కడ కూడా కరీనా హిట్ కొట్టినట్టే లెక్క.
ఉద్యోగం/కెరీర్‌లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment