ధూపవిచిత్రాలు! | enjoy the creativity of habitual | Sakshi
Sakshi News home page

ధూపవిచిత్రాలు!

Published Tue, Apr 15 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

ధూపవిచిత్రాలు!

ధూపవిచిత్రాలు!

 సృజన
 ప్రశాంతంగా ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశంకేసి చూస్తుంటే... నీలిమేఘాలు భారంగా కదులుతుంటే, తెల్లని మేఘాలు దూదిపింజల్లా తేలిపోతుంటాయి. ఆ మబ్బుల్లో ఆకారాలను వెతుక్కోవడం భలే సరదా.

అంతటి సృజనాత్మకతను ఆస్వాదించడం అలవాటైన మనసు ఊరుకుంటుందా? అగరువత్తి నుంచి వెలువడే ధూపంలోనూ ఆకారాలు వెతుక్కుంటుంది. అలా ఒక రూపం ఇచ్చి ‘స్మోక్ ఆర్ట్’ అని పేరు పెట్టారు రవిబాబు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపు ఆ బొమ్మలు.
 
 స్మోక్ ఆర్ట్ మీద ఆసక్తి కలిగిన సందర్భం!
 
‘‘దాదాపుగా పదేళ్ల క్రితం ఒకసారి ఇంటర్‌నెట్‌లో ఒక ఫొటో చూశాను. ఒక ఫొటోగ్రాఫర్ ధూపాన్ని ఫొటో తీసి దానికి ఫొటోషాప్‌లో ఒక ఇమేజ్‌ని అనుసంధానం చేశాడు. దానిని చూసినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఇది. చిత్రకారుడిగా ఎన్నో ప్రయోగాలు చేశాను. దేవుడి ముందున్న సాంబ్రాణి కడ్డీ నుంచి వెలువడే ధూపం గాల్లో కలిసేలోపు ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో! మనం ఎన్ని కోణాల్లో చూస్తే అన్ని రూపాలు కనిపిస్తాయి. నేను ఆసక్తిగా చేసుకున్న అ అలవాటుకి అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ స్ఫూర్తితో ఒక రూపం ఇవ్వగలిగాను. మొదట్లో ఒక బొమ్మ వేయడానికి ఒక రోజు పట్టింది. ఇప్పుడు గంట సేపటికి ఒక బొమ్మ సిద్ధమవుతోంది’’ అన్నారు రవిబాబు.
 
 బ్రష్ లేదు... పెయింట్ లేదు..!
 
స్మోక్ ఆర్ట్ వేయడానికి రంగులు, కుంచెలు అక్కర్లేదు. ఒక రూపాన్ని ఊహించుకుని దానిని కంప్యూటర్ స్క్రీన్ మీద డ్రాయింగ్ వేస్తారు. ఫొటోషాప్‌లో మరికొన్ని ఎఫెక్ట్‌లిస్తారు. కంప్యూటర్ మౌస్‌తో అన్ని ఆకారాలనూ గీయడం కష్టం. అలాంటి వాటిని కాగితం మీద పెన్సిల్‌తో గీసి స్కాన్ చేయాలి. ఆ సాఫ్ట్ కాపీ ఆధారంగా కంప్యూటర్ పెన్సిల్ టూల్‌తో బొమ్మ పూర్తి చేస్తారు. డిజిటల్ పెయింటింగ్‌లో ఇదో ప్రక్రియ. బొమ్మను చూస్తే పొగను ఫొటో తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన పొగ కాదు, పొగలా కనిపించే ఒక రకమైన చిత్రకళ. ‘‘ఇందులో సృజనాత్మకత ప్రధానం.
 
ఆ దృష్టి ఉంటే మన చుట్టూ కనిపించే ఏ వస్తువునుంచి అయినా కళారూపాన్ని సృష్టించవచ్చు. ఈ రకమైన రూపకల్పన నాతోనే మొదలైందని అనుకుంటున్నాను. నేను చిత్రకారుడిగా శిక్షణ పొందలేదు. ఉత్తమ్ గారి ఏకలవ్య శిష్యుణ్ని. ఆయనను కలిసి బొమ్మవేయడంలో మెలకువలు అడిగినప్పుడు... మెటీరియల్ వాడకం గురించి సలహాలిచ్చారు. ‘బొమ్మ ఎలా వేయాలనేది చిత్రకారుడే నిర్ణయించుకోవాలి. ఎవర్నీ అనుకరించకూడదు, అనాటమీ తప్పకూడదు’... అన్నారు. నేను ఆ మాటలనే అనుసరిస్తున్నాను’’ అంటారు రవిబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement