డేటా లీకేజి వెనుక బ్లూ ఫ్రాగ్‌!  | Blue Frog behind data leakage | Sakshi
Sakshi News home page

డేటా లీకేజి వెనుక బ్లూ ఫ్రాగ్‌! 

Published Tue, Mar 5 2019 4:38 AM | Last Updated on Tue, Mar 5 2019 4:38 AM

Blue Frog behind data leakage - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐటీ హబ్‌ అవుతుందనుకున్న విశాఖ నగరం చివరికి డేటా లీకేజి కేంద్రంగా మారింది. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌ చేసేస్తామని ఐదేళ్లుగా చెబుతున్న సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోక్‌శ్‌.. దీన్ని డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు తాజా సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. విశాఖ కేంద్రంగా డేటా అక్రమ వినియోగం కోసం కొన్నేళ్లుగా పక్కా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ వ్యవహారం వెనుక హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీతో పాటు విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ సంస్థ హస్తం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించిన సేవామిత్ర మొబైల్‌ యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడుకోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణలోని సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు హైదరాబాద్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం నుంచి సోదాలు నిర్వహించారు. కొన్ని హార్ట్‌ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నేత తుమ్మల లోకేశ్వరరెడ్డి మాదాపూర్‌ పోలీసులకు చేసిన మరో ఫిర్యాదుతో విశాఖలోని బ్లూ ఫ్రాగ్‌ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్‌ ఆధారిత సేవల పేరిట వైజాగ్‌లోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ సంస్థ రాష్ట్ర జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్‌ కార్డులు, ఏపీ స్మార్ట్‌ పల్స్‌ సర్వే, స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌తో పాటు హైదరాబాద్‌లోని కావ్య డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది. ఈ డేటా మొత్తాన్ని ఐటీ గ్రిడ్స్‌ ఇండియా సంస్థకు అందిస్తోందని లోకేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ యాప్‌లో ఓటర్ల వివరాలు ఉండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

సీఎంతో హెలికాప్టర్‌లో వెళ్లేంత సాన్నిహిత్యం 
విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఫణిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సీఎంతో హెలికాప్టర్‌లో కూడా తిరిగేంతటి సాన్నిహిత్యం అతడికి ఉందని విశాఖ టీడీపీ నేతలు చెబుతున్నారు. పదేళ్ల కిందట సింగపూర్‌ నుంచి తిరిగొచ్చి.. విశాఖలో స్థిరపడిన ఫణి మొదట్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బ్లూ ఫ్రాగ్‌ సంస్థను నెలకొల్పిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ద్వారా సీఎంకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ యాప్‌లు, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌కు సంబంధించిన ఐటీ సర్వీసులన్నీ ఆయనే చూసేవారు. ఈ క్రమంలోనే డేటా లీకేజి పనిని కూడా సదరు ఫణికే అప్పగించారన్న వాదనలకు బలం చేకూరుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement