‘బోగస్’లపై ఆర్‌ఆర్ కొరడా | Bogus cards Revenue Recovery Act in srikakulam | Sakshi
Sakshi News home page

‘బోగస్’లపై ఆర్‌ఆర్ కొరడా

Published Wed, Oct 1 2014 3:04 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

‘బోగస్’లపై ఆర్‌ఆర్ కొరడా - Sakshi

‘బోగస్’లపై ఆర్‌ఆర్ కొరడా

 శ్రీకాకుళం సిటీ: గత ప్రభుత్వాల హయాంలో బోగస్ కార్డులతో చాలామంది లబ్ధి పొందారని, విచారణ జరిపి అటువంటి వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి ప్రభుత్వ నిధులను కక్కిస్తామని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు లక్ష మంది బోగస్ జాబ్ కార్డుదారులున్నారని, ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఎంత నిధులు తిన్నారో తేల్చాలని ఆదేశించారు. బోగస్ రేషన్ కార్డులతో బియ్యాన్ని మింగిన డీలర్లపైనా విచారణ జరిపి రికవరీ చేయించాలని ఆదేశించారు.
 
 అక్టోబర్ 2 నుంచి పింఛన్ల పెంపు, జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుందని చెప్పారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడతారన్నారు. ఫించ న్లను ఏరివేయడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అర్హులెవరికైనా ఫింఛన్ ఆగిపోతే నేరుగా తననే అడగవచ్చని మంత్రి అన్నారు. అనర్హులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదన్నారు. అనంతరం సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ మంత్రి వెళ్లిపోవడంతో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సమావేశాన్ని నడిపించారు. గత పదేళ్లలో అనర్హులే ఎక్కువగా పింఛన్లు పొందారని కాగ్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చనిపోయిన వారికి, వలస వెళ్లిన వారికి పింఛన్లు ఎలా ఇచ్చారన్న దానిపై విచారణ చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
 
 ఫించన్ల సర్వేపై గరం గరం
 కాగా పెన్షనర్ల వివరాల సేకరణకు ఇటీవల జరిగిన సర్వే తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ధ్వజమెత్తడంతో ఈ అంశంపై వాడీవేడిగా చర్చ జరిగింది. మొదట మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో రాజకీయాలు చేయడం లేదని, అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా పించన్ ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పందిస్తూ గ్రామాల్లో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పరిశీలన, ఎంపిక అంతా గ్రామ సర్పంచ్‌లకు సైతం చెప్పకుండా టీడీపీ కార్యకర్తలతోనే చేయిస్తున్నారెందుకంటూ నిలదీశారు. పింఛన్ల తుది జాబితాలను టీడీపీ కార్యకర్తలే తయారు చేస్తున్నారని, దీంతో అర్హులు బాధితులవుతున్నారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు.
 
 గుర్తింపు కార్డుల్లో వయస్సు సమస్యలున్నాయని, దీంతో వృద్ధులకు పింఛన్లు అందే పరిస్థితి లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన టెక్కలి, నందిగాం, బూర్జ, రాజాం జెడ్పీటీసీలు కర్నిక సుప్రియ, కురమాన బాలకృష్ణ, ఎ.రామకృష్ణ, టి. పాపినాయుడు తదితరులు పోడియం వద్దకు వెళ్లి తమ వాదన విన్పించారు. మంత్రి స్పందిస్తూ ఇటువంటి వాటిని ఎక్కడా ప్రోత్సహించడం లేదని, గ్రామ, మండల కమిటీలు ఆమోదం తెలుపకపోతే, జిల్లా కమిటీ ఉంటుందని, దానికి తానే చైర్మన్ కాబట్టి నేరుగా తనకే చెప్పాలని సూచించారు. అలాగే వయస్సు విషయంలో ఎక్కువ వయసు నమోదైన కార్డునే ప్రామాణికం చేస్తామని హామీ ఇచ్చారు.
 
 కాగా ప్రతిపక్షం ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని, అయితే పింఛన్ల పంపిణీ ప్రారంభం కాకముందే ఇలా రచ్చ చేయడం ఎందుకని ఎమ్మెల్యే శివాజీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రంగు మారింది కదా.. ఇంకెందుకు వాళ్లకు చర్చలకు అవకాశం ఇవ్వడం.. అదే విషయం చెప్పండి అంటూ మంత్రి అచ్చెన్నకు సూచించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన అవివాహితులకు కూడా పింఛన్ ఇవ్వాలని కోరారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ జిల్లా కమిటీలో ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించాలని కోరారు. పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరం మాట్లాడుతూ పలు గ్రామాల్లో పింఛన్లు రద్దు చేయకుండా తీర్మానాలు చేసుకుంటున్నారని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అలా చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 యూరియా ఎప్పుడిస్తారండీ?
 యూరియా కొరతపైనా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా ఇంతవరకు యూరియా సక్రమంగా సరఫరా కావడంలేదని వారు ఆరోపించారు. వ్యవసాయ శాఖపై చర్చలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొంటూ పలు మండలాల్లో ఎరువుల కొరత ఉందని, బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జెడ్పీటీసీ చిట్టి జనార్ధనరావు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. నందిగాం ఎంపీపీ విశ్వశాంతి మాట్లాడుతూ తమ మండలంలో ఒక సొసైటీ పరిధిలో 40 గ్రామాలుంటే, మరో సొసైటీ లో 150 గ్రామాలున్నాయని,
 
 అయితే ఈ రెండు సొసైటీలకూ ఒక్కొక్క లోడు యూరియా ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు.  ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాకు సరిపడ యూరియా త్వరలో రానుందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ మాట్లాడుతూ వారం తర్వాతే యూరియా వస్తుందని, జిల్లాలోని 40 సొసైటీల్లో 500 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు. రైతులు సొసైటీల ద్వారా చెల్లిస్తున్న బీమా డబ్బును రుణమాఫీగా చూపించేలా వచ్చిన జీవో 174పై బూర్జ జెడ్పీటీసీ రామకృష్ణ ప్రశ్నించారు. దీనికి విప్ రవికుమార్ స్పందిస్తూ జీవో వివరాలను చదివి విన్పించారు. అనంతరం ఉపాధి హామీ, అటవీ శాఖ, హౌసింగ్ తదితర శాఖలపై చర్చించారు.
 
 అధికారుల తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం
 2011 నుంచి 2014 వరకు జెడ్పీ కార్యాలయ ఖర్చు రూ. 2.55 కోట్లు చూపడంపై ఎమ్మెల్యే కలమట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖర్చుల వివరాలు ఇవ్వాలని మూడు నెలల నుంచి అడుగుతున్నా అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. అలాగే జెడ్పీ  ప్రాంగణంలో రూ.74.51 లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధుల వినియోగం వివరాలు కూడా ఇవ్వలేదని నిలదీశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కక్ష పూరితంగానే తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ హరిపురంలో ఒక ఎరువుల వ్యాపారి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్నారని, బిల్లులు  ఇవ్వకుండా వ్యాపారం చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితం తాను స్వయంగా వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి వెళ్లి చెప్పినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 జేడీ సమాధానమిస్తూ తమ చర్యలు సత్ఫలితాలివ్వలేదని చెప్పడంతో జేసీ వీరపాండ్యన్  ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ ఖండాపు జ్యోతి, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, పీరుకట్ల విశ్వప్రసాద్, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, డీసీసీబీ ఛైర్మన్ డోల జగన్, డీసీఎంఎస్ ఛైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డీఎస్‌కే ప్రసాద్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
 
 శివాజీ చురకలు
 ఈ సమావేశంలో ఎమ్మెల్యే శివాజీ తనదైన రీతిలో మాట్లాడుతూ మంత్రి, విప్, అధికారులకు చురకలంటించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడి.. మనం మాట్లాడటం కంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మాట్లాడే అవకాశమిద్దామని సూచించారు. ప్రభుత్వ విప్ రవికుమార్‌పై పలు సెటైర్లు సంధించారు. చీఫ్ విప్ రవి కుమార్ గారూ.. అని సంభోదిస్తూ ‘మీరు చాలా స్పీడ్‌గా ఉన్నారు. అసలు మీ చీఫ్ విప్ కూడా మా దగ్గర ఇంత స్పీడ్‌గా ఉండడు అంటూనే.. ఇంతకీ సమావేశం ఎజెండాను విధాన పరంగా రూపొందిస్తారా.. విప్ చెప్పినట్లు చేస్తారా.. అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరో సందర్భంలో ‘రవి గారికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే.. అయితే తీర్మానాల విషయంలో అభ్యంతరాలు చెప్పవద్దని ప్రతిపక్షాన్ని అనడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement