సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగి రమేష్‌లు పాల్గొన్నారు. ('చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్')
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏడాది పాటు సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలనను మించి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నాడన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా నూటికి తొంబై అయిదు శాతం అన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు.
ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ ఏడాది కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏ రాష్ట్రంలోని జరగని పరిపాలన అందించారని, దేశంలోని ఇతర రాష్ట్రాలు నేడు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పరిపాలన అందించారని ప్రశంసించారు. రాష్ట్రంలో అనాదిగా ఉన్న విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన పరిపాలన అందిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment