
బాబూ.. నిప్పువైతే రాజీనామా చెయ్
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ ఎదుర్కొని నిప్పో.. తుప్పో తేల్చుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారి అయిన ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏసీబీ వేసిన అనుబంధ చార్జిషీటుతో కేసులో ఆయనే కీలకవ్యక్తి అని మరోసారి బయటపడ్డా సీఎంగా ఇంకా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో బొత్స మాట్లాడా రు. ఓటుకు కోట్లు కేసులో ఖల్‌నాయక్ చంద్రబాబేనని, ఒక ముఖ్యమంత్రిపై కోర్టులో చార్జిషీటు దాఖలైనప్పుడు దేశంలో ఎక్కడా సదరు సీఎం పదవిలో కొనసాగలేదని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏసీబీ తాజాగా సమర్పించిన అనుబంధ చార్జిషీటును మీడియా ప్రతినిధులకు చూపించారు. త్వరలో ఫోరెన్సిక్స్ రిపోర్టు కూడా వస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా న్యాయస్థానాలకు వెళ్లి ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే, భావితరాలకు, రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే వెంటనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
తెలంగాణ, కేంద్రంతో రాజీ..: ఓటుకు కోట్లు కేసు వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం, తెలంగాణ రాష్ట్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారని బొత్స చెప్పారు. కృష్ణాజలాల విషయంలో రాష్ట్ర రైతులు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.సుప్రీం కోర్టు నోటీసులకు, ఏసీబీకి మధ్య తేడా ఉందన్నారు. న్యాయం జరగాలని ఓ పౌరుడిగా ఎమ్మెల్యే ఆర్కే కేసు వేశారని పేర్కొన్నారు.