బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ: జిల్లాలో పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. సోమవారం నాటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ ఆర్‌ఆర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాన్వెంట్ రోడ్డులోని సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెల్లంపల్లి నియోజకవర్గంలో కోటి పైచిలుకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పనులను ప్రక్షాళన చేస్తామని వ్యాఖ్యానించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇంటి పక్కన సైతం రోడ్డు వేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, తాగునీరు సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విషయంలో గత ప్రభుత్వం ఎజెండా వేరని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసిందని ఎమ్మెల్యే ఇక్బాల్ విమర్శించారు. గణాంకాలలో లేని అభివృద్ధిని చూపించారని, ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను విస్మరించారు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment